- ఆదాబ్ హైదరాబాద్ కథనాలకు స్పందించిన ప్రభుత్వం
- టిఎస్ఐఐసి భూముల అక్రమాలపై విచారణకు ఆదేశించిన మంత్రి
- అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు ఉంటాయా?
- ఉపాథి కోసం వెతుకుతున్న యువతకు న్యాయం జరుగనుందా..?
- పారదర్శకంగా పాలన అందించే అధికారులు విధుల్లో రాబోతున్నారా..
- ప్రజా పాలన అంటే ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వం చూపించనుందా..?
మా అక్షరం అవినీతిపై అస్త్రం అంటూ.. నిక్కచ్చిగా వాస్తవ కథనాలకు ప్రాధాన్యత ఇస్తూ..సమాజ హితం కోరుతూ.. ప్రజలకు జవాబుదారీగా వుంటూ సాగిపోతున్న ఆదాబ్ హైదరాబాద్ అలుపెరుగని పోరాటంతో మరో అవినీతి కథనంతో.. ప్రభుత్వంలో చలనం తీసుకురాగలిగింది. పటాన్ చెరు నియోజకవర్గం, రామచంద్రపురం ప్రధాన రోడ్డుపై 14 ఎకరాల స్థలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిఎస్ఐఐసి పఠాన్ చెరు స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లీజుకు ఇచ్చింది. కోట్ల విలువచేసే స్థలం అవ్వడం అంతేకాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉండడాన్ని గమనించిన అక్రమార్కులు టి ఎస్ ఐ ఐ సి అధికారుల సహకారంతో కొట్టేసేందుకు భారీ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇదే విషయాన్ని ఆదాబ్ పలు కథనాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందిస్తూ అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. టి ఎస్ ఐఐ సి ఉన్నతాధికారులు సైతం అక్రమార్కులకు అండదండలు అందిస్తుండడంతో.. విచారణ సాఫీగా జరుగుతుందా అనేది అనుమానమే? అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పఠాన్ చెరు టి ఎస్ ఐ ఐ సి లో అధికారుల సహకారంతో జరిగిన మరిన్ని అక్రమాలను ఆదాబ్ మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది…” మా అక్షరం అవినీతిపై అస్త్రం “