సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి
సింగరేణి సహకారం మరువలేంః ఓయూ వీసీ
హైదరాబాద్: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద సింగరేణి నిధులతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)లో నిర్మించిన ఈసీఈ తరగతి గదుల సముదాయాన్ని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరంతో కలిసి ప్రారంభించారు. రూ.2 కోట్లతో ఆ నిర్మాణానికి సహకరించటం తమ సంస్థకు ఎంతో గర్వకారణమని అన్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని ఆధునికీకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి సంస్థ తన వంతు సహకారం అందిస్తుందని చెప్పారు. భవిష్యత్తులోనూ ఓయూకి అన్నివిధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో సింగరేణి సంస్థ మైనింగ్ ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించడానికి ఓయూ పూర్తి స్థాయిలో సహకరించిందని గుర్తు చేశారు. ఓయూలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగానికి సింగరేణి అధ్యాపకులను కేటాయించిందని, ప్రొఫెసర్ ఛైర్ పథకం కింద నిధులు కూడా ఇచ్చిందని ఎన్.బలరామ్ తెలిపారు. ఓయూ వీసీ ఆచార్య కుమార్ మొలుగరం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమని అన్నారు. ఓయూకి సింగరేణి అందించిన ఆర్థిక సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. ఓయూలో మైనింగ్ సబ్జెక్ట్ బోధనను తిరిగి ప్రారంభించేందుకు కూడా పూర్తి సహకారం అందించిందని వివరించారు. ఇకపై కూడా సింగరేణి తస సహకారాన్ని అందించాలని కోరారు. ఓయూ పురోభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అత్యుత్తమ విద్యాబోధనకు ఓయూ వేదిక అని అభివర్ణించిన ప్రొఫెసర్ కుమార్.. మౌళిక వసతుల కల్పనలో సింగరేణి తదితర సంస్థల భాగస్వామ్యానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ఆచార్య జి.నరేష్ రెడ్డి, ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్, ఈసీఈ విభాగ అధిపతి ప్రొఫెసర్ డి.రామకృష్ణ, సింగరేణి అధికారులు ఎన్.భాస్కర్, జి. రమేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.