Thursday, July 3, 2025
spot_img

చ‌ట్టం గీత దాటిన గీత ఆర్ట్స్‌

Must Read
  • గీత ఆర్ట్స్ డిజిటల్ పన్నుమందిపులో మాయాజాలం
  • సామాన్యుడిపై కఠినం, సెలబ్రిటీకి మినహాయింపా?
  • పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన‌ అధికారులు.
  • అక్రమ నిర్మాణంపై పెనాల్టీ వేయని జీహెచ్ఎంసీ ఆఫీస‌ర్స్‌
  • అధికారులకు ముడుపులు, జీహెచ్‌ఎంసీ ఖజానాకు తూట్లు.
  • జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్య వైఖరిపై ప్రజాగ్రహం!
  • అవినీతికి పాల్పడిన అధికారులపై శాఖాపరమైన చర్యలకు డిమాండ్

సామాన్య పౌరులు పన్ను కట్టడంలో ఒకరోజు ఆలస్యం చేస్తే ఇంటి ముందు ధర్నాలు, ఆస్తుల జప్తు అంటూ కఠిన చర్యలకు దిగే జీహెచ్‌ఎంసీ అధికారులు, కోట్ల రూపాయల వ్యాపారం జరిగే గీత ఆర్ట్స్ డిజిటల్ భవనంలో స్పష్టమైన పన్ను ఎగవేత, అక్రమ నిర్మాణంపై నామమాత్రపు చర్యలు కూడా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. సెలబ్రిటీల బాధ్యతారాహిత్యాన్ని, జీహెచ్‌ఎంసీ అధికారుల నిస్సిగ్గు నిర్లక్ష్యాన్ని మరోసారి కళ్ళకు కట్టింది ఈ గీత ఆర్ట్స్ డిజిటల్ వ్యవహారం.

జూబ్లీహిల్స్, షేక్‌పేట గ్రామంలోని ఇంటి నెం.: 8-2-293/82/A/775-ఏ (సర్వే నెం: 120 (పాత నెం.403/1)) మరియు హకీంపేట గ్రామం (ఎస్.వై. నెం. 102/1)లో ఉన్న గీత ఆర్ట్స్ డిజిటల్ సంస్థకు చెందిన అల్లు బిజినెస్ పార్క్‌పై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. నిర్మాణ అనుమతులకు విరుద్ధంగా అదనపు ఫ్లోర్, పెంట్ హౌస్ నిర్మించి, జీహెచ్‌ఎంసీ ఖజానాకు లక్షల రూపాయల పన్ను నష్టం చేకూర్చడమే కాకుండా, ప్రభుత్వాన్ని మోసగించి ఆస్తి పన్ను మదింపులో భారీ స్థాయిలో వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

“మాకు చట్టాలు వర్తించవు” అన్న ధోరణి!
జీహెచ్‌ఎంసీ జారీ చేసిన బిల్డింగ్ పర్మిట్ నెం.: 1/సి 18/00818/2019 ప్రకారం, ఈ భవనం జనవరి 20, 2019న ప్రారంభమై, నవంబర్ 10, 2022న పూర్తయింది. జనవరి 11, 2023న జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయం సిటీ ప్లానర్ శైలజ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కే. శ్రీనివాస్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (అప్లికేషన్ నెం.: 012821/జిహెచ్ఎంసి/6270/ఖైరతాబాద్1/2022-ఓ సి) జారీ చేశారు. మంజూరైన ప్లాన్ ప్రకారం ఇది సెల్లార్ + స్టిల్ట్, గ్రౌండ్ + 4 ఎగువ అంతస్తులు కలిగి, నివాసానికి అనుకూలమైనదిగా ప్రకటించబడింది.

అయితే, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందిన తర్వాత, “మేము సెలబ్రిటీలం, మాకు నిబంధనలు, జీహెచ్‌ఎంసీ చట్టాలు వర్తించవు” అన్న దుందుడుకు ధోరణితో నిబంధనలకు విరుద్ధంగా మరో అంతస్తును నిర్మించడమే కాకుండా, పెంట్ హౌస్ ఏర్పాటు చేసుకుని, అన్ని సౌకర్యాలతో కూడిన రెస్టారెంట్‌ను కూడా నడుపుతున్నట్లు నిస్సందేహంగా వెల్లడవుతోంది. ఈ కమర్షియల్ రెస్టారెంట్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. ఇది కేవలం పన్ను ఎగవేత మాత్రమే కాదు, చట్టాలను అపహాస్యం చేయడమే.

జీహెచ్‌ఎంసీ ఖజానాకు భారీ నష్టం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం, అక్రమ నిర్మాణాలకు 100 శాతం పన్ను పెనాల్టీ విధించాలి. కానీ, గీత ఆర్ట్స్ డిజిటల్ సంస్థకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఉంది కాబట్టి సాధారణ పన్ను మాత్రమే చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇది జీహెచ్‌ఎంసీ చట్టం 1955కి స్పష్టంగా విరుద్ధం. జీహెచ్‌ఎంసీ పన్నుల శాఖ ద్వారా రూపొందించబడిన అసెస్‌మెంట్ వివరాల ప్రకారం, గీత ఆర్ట్స్ డిజిటల్ ప్రస్తుత వార్షిక పన్ను రూ.12,21,672. ఇందులో ఆస్తి పన్ను రూ.11,31,174, లైబ్రరీ సెస్ ₹90,498 ఉన్నాయి. అయితే, అనధికార నిర్మాణ జరిమానా రూ.0గా చూపబడింది. అంటే, అదనపు అంతస్తు, పెంట్ హౌస్‌కు సంబంధించి ఎటువంటి జరిమానా విధించబడలేదని స్పష్టమవుతోంది. ఇది డిప్యూటీ కమిషనర్, ఏఎంసీ, బిల్ కలెక్టర్లు లక్షల రూపాయల పన్ను నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

సామాన్య ప్రజలు ఒక సంవత్సరం పన్ను కట్టకుంటే పెద్ద రచ్చ చేసే జీహెచ్‌ఎంసీ అధికారులు, కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్న ఈ భవనంలో పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడి, అక్రమ నిర్మాణానికి ఎలాంటి పెనాల్టీ వేయకుండా ఉన్నారంటే వారి బరితెగింపునకు, అవినీతికి ఇది పరాకాష్ట! జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణంపై తక్షణమే, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

గీత ఆర్ట్స్ డిజిటల్ అక్రమ నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, వారికి జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని స్థానిక ప్రజలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. పన్ను మదింపులో అవకతవకలకు పాల్పడిన డిప్యూటీ కమిషనర్‌పై, ఏఎంసీ మరియు బిల్ కలెక్టర్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, గత రెండు సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం అధికారుల నుండి రాబట్టాలని మరియు గీత ఆర్ట్స్ డిజిటల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.

సినిమా పరిశ్రమ కేవలం వినోదాన్ని మాత్రమే కాకుండా, సామాజిక బాధ్యతను కూడా గుర్తించి, చట్టాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తోంది. సెలబ్రిటీలు తమ హోదాను సామాజిక శ్రేయస్సుకు వినియోగించుకోవాలి తప్ప, దానిని వ్యక్తిగత లాభాలకు, చట్ట ఉల్లంఘనలకు సాధనంగా మార్చుకోకూడదు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS