- వైద్య సేవల కోసం భారీగా నిధుల వెచ్చింపు
- ఖమ్మంలో మెడికల్ కాలేజీ నిర్మాణానికి శంకుస్థాపన
- పాల్గొన్న నలుగురు మంత్రులు
ప్రభుత్వ మెడికల్ కళాశాల ద్వారా పేదలకు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఉచితంగా అందుతాయని, ఖమ్మం మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం చాలా సంతోషంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఈ ప్రభుత్వం దొరల కోసమో పాలకుల కోసమో పని చేసే ప్రభుత్వం కాదని అన్నారు. 9065 సీట్లలో వైద్య విద్యను అందజేస్తున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించామని అన్నారు. పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. 5,950 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలో రూ. 11,482 కోట్లు- ఖర్చు చేసిందన్నారు. వరంగల్‌లో సభ పెట్టి అడ్డగోలు మాటలు మాట్లాడిన వారికి ఈ లెక్కలు తెలియాలని చెబుతున్నానని అన్నారు. 90 లక్షల కుటుంబాలకు రూ. 10 లక్షల వరకూ లబ్ధి చేకూర్చి వైద్యం అందించామని తెలిపారు. గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం గాలికి వదిలేసిన వైద్య రంగాన్ని గాడిన పెడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి గురువారం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శంకుస్థాపన చేశారు.








ఈ సందర్బంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యా వైద్య రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. ప్రపంచంతో పోటీపడేలా విద్యా వైద్య రంగాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవన సముదాయ నిర్మాణానికి శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన మంత్రి తుమ్మల ధన్యవాదాలు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నాగపూర్, అమరావతి నేషనల్ హైవే పక్కన మెడికల్ కాలేజ్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండిరగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు. విద్య వైద్య రంగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ కళాశాల నిర్మాణాన్ని పూర్తి చేస్తుందన్నారు. అన్ని రకాల మౌలిక వసతులతో మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయబోతు న్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు.
మా అందరికీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదర్శమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. రూ. 130 కోట్లతో ఖమ్మంలో మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని, గోదావరి పరివాహక ప్రాంతంలో ఆరోగ్యశాఖ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 16 నెలల పాలనలో వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లా ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు కృషి జరుగుతోందన్నారు. తర్వలోనే ఖమ్మంకు ఆర్గాన్ రిట్రీవర్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, వరంగల్‌లో రూ. 39 కోట్లతో రీజీనల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే ఖమ్మంలో వ్యాస్కులర్ యాక్సెస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాలకు అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కోరిక మేరకు నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. మిడ్ వైఫరీ కోర్స్‌లు విద్యార్థులకు అందుబాటు-లో ఉంచబోతున్నామని, పేద వారికి వైద్యం అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర అభిప్రాయం వ్యక్తం చేశారు.