- సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్
- భూ భారతిపై సీసీఎల్ఏ ఉద్యోగులకు అవగాహన సదస్సు
- కేక్ కట్ చేసి రెవెన్యూ ఉద్యోగులకు, రైతులకు శుభాకాంక్షలు తెలిపిన మిట్టల్
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా రూపొందించిన భూ భారతి చట్టం – 2025 చరిత్రాత్మకం అని సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. సీసీఎల్ఏ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి హోదాలో నవీన్ మిట్టల్ భూ భారతి చట్టం -2025 రూపకల్పనలో కీలక భూమిక పొషించడంతో పాటు రెవెన్యూ సర్వీసెస్ సేవలను బలోపేతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన సంగతి విదితమే. భూ భారతి చట్టం ప్రారంభోత్సవం తర్వాత సోమవారం తొలిసారి సీసీఎల్ఏ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా నవీన్ మిట్టల్ ను తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో సీసీఎల్ఏ ఉద్యోగులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రైతులకు, రెవెన్యూ ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం సీసీఎల్ఏ కార్యాలయ ఉద్యోగులకు భూ భారతి చట్టం – 2025 పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ఉద్యోగులకు చట్టం అనివార్యత, చట్టంలోని ప్రతి క్లాజ్ తో పాటు రూల్స్ పై దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర కోశాధికారి మల్లేశ్, టీజీఆర్ఎస్ఏ సీసీఎల్ఏ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణ చైతన్య, రాంబాబు , శ్రీకాంత్ రెడ్డి, సురేష్ మరియు పెద్ద సంఖ్యలో సీసీఎల్ఏ విభాగం ఉద్యోగులు పాల్గొన్నారు.
