- గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పెద్ద ఎత్తున నిధులు
- ఇచ్చుకో పుచ్చుకో దంచుకో అన్నవిధంగా వ్యవహరిస్తున్న అధికారులు
- ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతటా నాసిరకం పనులే..!
- ప్రజాధనం వృధాపై కన్నెర్ర చేస్తున్న ప్రజానికం
ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద సిసి రోడ్ల నిర్మాణం కొరకు వికారాబాద్ జిల్లాలోని గ్రామాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు కాగా ఇప్ప టికే సగానికి పైగా సిసి రోడ్ల నిర్మాణం పనులు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో పనులు కొనసాగుతున్నాయి. కానీ నిధులను ఇష్టారాజ్యం గా ఖర్చు చేసి నాసిరకం పనులు జరిగాయని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతిపాదనలు ఒకచోట పనులు ఇంకోచోట చేస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పనులు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఇదంతా జరుగుతుందని ప్రజల ఆరోపిస్తున్నారు. ఇక పోతే గతంలో వేసిన రోడ్లు 8 నెలలు కూడా గడవక ముందే పగుళ్లు ఏర్పడటం నాసిరకం పనులకు నిలువెత్తు నిదర్శనం. ఇందుకు కారణం సిమెంట్ కన్నా డస్ట్ ఎక్కువగా ఉండటంతో రోడ్డు బీటలు పారడానికి కారణం అవుతుంది. బారీ వాహనాలు ప్రయాణిస్తే కంకర తేలి రోడ్లన్నీ దుమ్ము ఏర్పడే ప్రమాదం ఉంది.పర్యవ సానంగా రూపాయలు కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని ప్రజల నుంచి అసహనం వ్యక్తం అవుతోంది. నిర్లక్ష్యంగా రోడ్లు వేసేవారిని స్థానిక ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు తెగబడతారంటు ప్రజలు వాపోతున్నారు. రోడ్ల నిర్మాణం చేపట్టే వారికి అధికారుల అండదండలు ఉండటం మూలంగానే ఇలా బరితెగిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఒకటి రెండు గ్రామాల్లోనే నాణ్యత ప్రమాణాలు..
వికారాబాద్ జిల్లాలోని ఆయా మండలాల్లో గల ఒకటి రెండు గ్రామాల్లో మినహా అంతట ఇదే తంతు కొనసాగుతోంది. రోడ్లు వేసి పెద్ద ఎత్తు న లాభాలు గడిరచాలనే దురుద్దేశంతో, లాభా ర్జనే ధ్యేయంగా పనులు చేస్తున్న వారికి అధికా రుల అండదండలు ఉండటం శోచనీయం అని ప్రజలు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే గనుక ఇచ్చుకో..పుచ్చుకో…దంచుకో అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నా రంటూ యావత్ ప్రజానికం కోడై కోస్తుంది.
అధికారులు ఎందుకు హెచ్చరించరు..?
ఒకవేళ నిజానికి అధికారులు పారదర్శకంగా వ్యవహరించే వారైతే సీసీ రోడ్ల విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని,లేని పక్షం లో బిల్లులు నిలిపివేస్తామని హెచ్చరించే వారు కదా అని జనం ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విష యంలో అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.