- మా పొట్ట కొట్టకండి.. మా బతుకులను ఆగం చేయకండి..
- చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులను వేడుకుంటున్న స్ట్రీట్ వెండర్స్
- చిరువ్యాపారులకు మద్దతుగా బీఆర్‌ఎస్ : కార్పొరేటర్ సునీత
రోడ్డుమీద చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవితాలు వెళ్లదీసుకుంటున్న మా వ్యాపారాలను తీసేసి మా బతుకులను రోడ్డుపాలు చేయకండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి, చిలకలగూడ ట్రాఫిక్ పోలీసులకు మెట్టుగూడ ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను నిర్వహించుకునే స్ట్రీట్ వెండర్స్ మొరపెట్టుకుంటున్నారు.. గత నాలుగు నెలలుగా తమ వ్యాపారాలను నిర్వహించుకోవడంలేదని శుక్రవారం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మెట్టుగూడ – తార్నాక మీల్స్ ఫుడ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చింత రమేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఆలుగడ్డ బావి బస్టాప్ నుండి తార్నాక ఆఫీసర్స్ క్లబ్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా చిరు వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నామని వారు తెలిపారు. చిరు వ్యాపారాల జీవనోపాధి, క్రమబద్ధీకరణ చట్టం 2014లోని చాప్టర్ 2 లోని 3(3)ప్రకారం ఏ చిరు వ్యాపారిని తొలగించరాదని చట్టం ఉందని ఆయన గుర్తు చేశారు. 2014 ప్రకారం మా ప్రాంతంలో సర్వే చేసి ప్రభుత్వం మాకు గుర్తింపు కార్డులు, స్కిల్ ట్రైనింగ్, ఫుడ్ సేఫ్టీ అధికారుల ట్రైనింగ్ సర్టిఫికెట్లు అందజేశారని ఆయన తెలియజేశారు. 20 ఏళ్లుగా 120 కుటుంబాలు చిరు వ్యాపారాలను నిర్వహించుకుంటూ బతుకులను వెల్లదిస్తున్నారని, ఉన్నట్టుండి ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను నిర్వహించుకోకుండా బండ్లను తొలగించడం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి విభాగం అధికారులు తమకు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అనుమతిని కూడా ఇచ్చారని, కానీ ట్రాఫిక్ పోలీసులు వ్యాపారాలను ఏర్పాటు చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే కుమారి ఆంటీకో న్యాయం మాకో న్యాయమా అంటూ స్ట్రీట్ వెండర్స్ మండిపడ్డారు. స్థానికంగా ఫుట్‌పాత్‌పై 20 ఏళ్లుగా భోజన వ్యాపారాలు చేసుకునే తమను ఖాళీ చేయాలని పోలీసులు బెదిరిస్తున్నారని వాపోయారు. ఇన్నేళ్లలో లేనిది ఇప్పుడు కొత్తగా పర్మిషన్ లేదంటూ వ్యాపారాలు చేసుకోనివ్వడంలేదన్నారు. ఆవిడలాగా మేమూ సీఎం ఫోటోకు పూజ చేస్తాం. పేదవారి పొట్టగొట్టకండి అని ఆవేదన వ్యక్తం చేశారు.
చిరువ్యాపారులకు మద్దతుగా బీఆర్‌ఎస్ పార్టీ ఉంటుంది: కార్పొరేటర్ సునీత
చిరు వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న బండ్లను తొలగిస్తున్నారని సమాచారం అందుకున్న మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత అక్కడికి చేరుకొని చిరు వ్యాపారులకు మద్దతుగా నిలిచారు. పబ్బులకు, వైన్స్ కు అడ్డురాని ట్రాఫిక్ జామ్ రెండు గంటలు ఉండిపోయే స్ట్రీట్ వెండర్స్ కు అడ్డువస్తుందా అని మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత మండిపడ్డారు. మాజీ మంత్రి కేటీఆర్ చొరవతో లోన్స్ ఇప్పించి ఐడి కార్డ్స్, సర్టిక్టిఫికెట్స్ ఇచ్చి మరి స్ట్రీట్ వెండర్స్ ను ఆదుకున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ జామ్ పేరుతో ఖాళీ చేయించి వారి పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. 20 ఏళ్లుగా వ్యాపారాలను నిర్వహించుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న వారిని వ్యాపారాలు ఏర్పాటు చేసుకోకుండా ఆటంకాలు సృష్టించడం సరైనది కాదని మండిపడ్డారు.