- లోన్ రెన్యువల్ చేసుకోలేదని హోల్డ్‌లో రైతుల ఖాతాలు
- వడ్డీ కిందకు రైతు భరోసా డబ్బులు పోగా.. కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి..
- పైసలు డ్రా చేసుకోలేక ఆందోళన చెందుతున్న రైతులు
- సర్కారు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయకపోవడంతో రైతులకు తిప్పలు..
యాసంగి సీజన్ కు గాను పెట్టుబడి సాయం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలలో రైతు భరోసా ఎకరానికి 6,000 చొప్పున జమచేస్తు న్న డబ్బులు రైతుల చేతికి రాకుండా బ్యాంకర్లు లాగేసుకుంటున్నారు. రైతు బంధు డబ్బులు పోగా కొందరు ఎదురు చెల్లిస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు తీసుకున్న రుణాల కింద, రుణాలకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని బ్యాంకులు జమ చేసుకుంటున్నాయి. కొన్ని బ్యాంకులు రైతుబంధు నిధులు తీసుకోకుండా రైతుల ఖాతాలను ముందే ‘హోల్డ్’లో పెట్టేస్తున్నాయి. అంటే వారెలాంటి లావాదేవీలు నిర్వహించడానికి వీల్లేకుండా చేస్తున్నారు. రుణం లేదా వడ్డీ చెల్లిస్తే కానీ ‘హోల్డ్’ తీసివేయబోమని నిక్కచ్చిగా చెబుతుండటంతో.. ప్రభుత్వ సాయం రావడంతో ఎంతో ఆశపడి బ్యాంకులకు వెళ్లిన రైతులకు తీవ్ర నిరాశే మిగులుతోంది. కాగా, బ్యాంకర్ల వైఖరిపై కొందరు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు బ్యాంకు నుండి రుణాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సర్కారు అందించే సాయం తమకు అందకుండా ఎలా చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రభుత్వం రుణమాఫీ వంద శాతం పూర్తి చేయకపోవడంతో లోన్ రెన్యువల్ చేసుకోలేక ఎంతో మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు బ్యాంకర్లను పిలిపించి మాట్లాడటం లేదని బాధిత రైతులు వాపోతున్నారు.
అధికారులు బ్యాంకర్లతో మాట్లాడాలి…
వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు 70,219 మంది రైతులకు రైతు భరోసా డబ్బులు జమ అయినట్టు తెలుస్తుంది. అయితే రైతుల ఖాతాలలో సుమారుగా రూ.33 కోట్లు జమయ్యాయని సమాచారం. అయితే పంట పెట్టుబడి సహాయం కొరకు ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా డబ్బులు బ్యాంకు అధికారులు ఇతర లోన్ ల సాకుతో హోల్డ్ చేయకుండా వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సూచించాలని రైతులు కోరుతున్నారు.