- తప్పుపట్టిన ఎమ్మెల్సీ కవిత
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం సభలో అసహనం ప్రదర్శించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కోపాన్ని చూపించారు. ‘ఏందయ్యా నీ లొల్లి.. రోజూ న్యూసెన్స్ చేస్తున్నావ్..’ అంటూ గద్దింపు ధోరణిలో మాట్లాడారు. సాటి సభ్యుల ముందు తాతా మధును అగౌరవపరిచారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీరును బీఆర్‌ఎస్ పార్టీ తప్పుపట్టింది. సభలో ఛైర్మన్ సుఖేందర్‌రెడ్డి తమ సభ్యుడిని ఉద్దేశించి న్యూసెన్స్ అనే పదం వాడటం కరెక్టు కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. దీనిపై ఆమె మండలిలో మాట్లాడుతూ.. సభలో మా సభ్యుడిని ఉద్దేశించి మీరు న్యూసెన్స్ అనే పదం వాడారని, తాను మీకు చెప్పేందుకు పెద్దదాన్ని కాదని, ఆ పదాన్ని దయచేసి రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. కాగా, మండలి ఛైర్మన్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మీడియా సమావేశం పెట్టనున్నట్లు తెలిసింది. మీడియా సమావేశం పెట్టి స్పీకర్ తీరును విమర్శించనున్నట్లు సమాచారం.