- క్షేత్ర చరిత్ర, వైభవం, మహాత్మ్యం కరపత్రాలను ఆవిష్కరణ
- కరపత్రాన్ని దేవస్థానంలో ఆవిష్కరించిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డాక్టర్. మోహనకృష్ణ భార్గవ
స్థానిక క్షేత్రాల చరిత్రను, వైభవాలను వ్యాప్తి చేసి వాటి అభివృద్ధి కోసం కృషి చేయడం మనందరి బాధ్యత అని ప్రముఖ సామాజిక కవి, రచయిత, ఆధ్యాత్మిక వేత్త డాక్టర్ ఎక్కలదేవి మోహనకృష్ణ భార్గవ అన్నారు. మంగళవారం కొడవటూరు గ్రామంలోని సిద్ధులగుట్ట క్షేత్రంలోని శ్రీ స్వయంభూ సిద్దేశ్వరాలయంలో పూజ్యశ్రీ సిద్ధాశ్రమం సుధానంద స్వామి, దేవస్థాన ప్రధానార్చకులు ఓం నమఃశివాయ, ఎంఆర్ఓ ప్రకాష్ రావ్, సీఐ ఎమ్ అబ్బయ్య, ఆలయ ఈవో చిందం వంశీ, ఎంపీడీవో మల్లికార్జున్, ఆలయ చైర్మన్ అందాల మల్లారెడ్డి మరియు స్వాములు, చరిత్ర పరిశోధకులు, కవులు, రచయితలు, దేవాదాయ శాఖ అధికారులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, వివిధ హిందూ సంఘాల ప్రతినిధుల సమక్షంలో మోహనకృష్ణ భార్గవ రచించి ప్రచురించిన విశ్లేషణాత్మక పరిశోధన వ్యాస సంకలనం “కొడవటూరు సిద్ధులగుట్ట (సిద్ధాద్రి) క్షేత్ర చరిత్ర, వైభవం, మహాత్మ్యం” కరపత్రాలను ఆవిష్కరించారు.

ఇట్టి కరపత్రాలను సిద్ధేశ్వర స్వామికి సమర్పించిన అనంతరం మోహనకృష్ణ మాట్లాడుతూ.. ఒకనాడు శతాబ్దాల చరిత్ర కలిగిన గొప్ప శైవ మహాక్షేత్రంగా, జానపద సంస్కృతులకు, ఋషిపరంపరాగత సాంప్రదాయాలకు నెలవై యోగుల తపోవనంగా, కాకతీయుల కాలంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందిన సిద్ధులగుట్ట నేడు ఆదరణ, గుర్తింపు, అభివృద్ధి పొందలేకపోతున్నదని అన్నారు. పర్యాటక కేంద్రానికి కావలసిన భౌగోళిక వనరులు, ఆధ్యాత్మిక క్షేత్రానికి కావలసిన వాతావరణం అన్నిటిని కలిగివున్నప్పటికీ పట్టణానికి దూరం కావడం మరియు సిద్ధులగుట్ట చరిత్ర అనేక శాసనాలను, ప్రాచీన ఆధారాలను, ఆనవాళ్లను, నిర్మాణాలను కోల్పోవడం, మౌఖికంగా గానీ, రచనల ద్వారా గానీ ప్రజల్లోకి చేరలేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమైందన్నారు. భారతీయ జానపద కళలను, శైవ సంస్కృతులను, ఆధ్యాత్మిక గ్రామీణ విశ్వాసాలను పరిరక్షిస్తున్నటువంటి సిద్ధులగుట్ట విశిష్టతలను ప్రజల్లోకి మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెల్లే విధంగా విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కాకుండా ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక, సాంస్కృతిక చైతన్యాన్ని భవిష్యత్తుకు పదిలంగా అందించినవారమవుతామని అన్నారు. అందులో భాగంగా తనవంతు కృషి సుధీర్ఘకాల పరిశోధన “సిద్ధులగుట్ట క్షేత్ర చరిత్ర, వైభవం, మహాత్మ్యం” కరపత్ర రూపంలో అందించినట్లు తెలిపారు..
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మండల ప్రముఖ్ కొత్తపల్లి రాజయ్య, జనగామ నగర ప్రముఖ్ డా అంబటి బాలరాజు, జిల్లా సహాయ కార్యదర్శి చిలువేరు హర్షవర్ధన్, సాంస్కృతిక విభాగ్ మాదాసు రాజేశ్వర్ భార్గవ, చక్రాల పోచన్న, కవి నక్క సురేష్, అర్చకులు సదాశివ, డా ఝాన్సీ, రూప చైతన్య తదితరులు పాల్గొన్నారు..