- మహాశివరాత్రికి మరో 18 రోజులే
- ఉత్సవ కమిటీ కూడా లేనట్టే..!
- ఇప్పటికే అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్
- పాలకవర్గం ఉంటేనే సజావుగా జాతర ఏర్పాట్లు
- కొత్త ఈ.ఓ తో ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా..?
ఏడుపాయల శ్రీ వనదుర్గామాత దేవస్థానం.. చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలిన ప్రాంతంలో వన దుర్గామాత వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ప్రతి ఏటా మహాశివరాత్రి నాడు తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర జరిగే ఈ దేవస్థానం చుట్టూ దట్టమైన అడవులు, మంజీరా నది ఏడుపాయలుగా చీలి దుర్గామాత పాదాల చెంత నుంచి పరవళ్ళు తొక్కే ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ల నుంచి లక్షలాదిమంది తరలి వస్తారు. అయితే ఈ మహాశివరాత్రి జాతరకు మరో 18 రోజులు మాత్రమే ఉండడంతో ఈసారి పాలక వర్గం ఉండదనే చెప్పవచ్చు. ఉత్సవ కమిటీ కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నామినేటెడ్ పదవులేవి భర్తీ చేయడానికి వీల్లేదు. దీంతో ఈ యేడు పాలకవర్గం లేకుండానే జాతర ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పాలక వర్గం ఉన్నట్లయితే జాతర పనులపై పర్యవేక్షణ, భక్తుల సౌకర్యాల కల్పనలో క్రియాశీల పాత్ర పోషించేది. గత పాలక వర్గం పదవీ కాలం 2024 ఆగస్టు 6 తో ముగియడంతో దేవాదాయ శాఖ సెప్టెంబర్ లో నూతన పాలక మండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
కానీ స్థానికంగా ఎవరూ దరఖాస్తు చేసుకోకపోవడం వలన అక్కడితోనే ఆగిపోయింది. తర్వాతనైనా మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉండగా దేవాదాయశాఖ అధికారులు స్పందించలేదు. దాంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నూతన పాలకమండలి ఏర్పాటు ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఐతే జాతరకు ముందు ఉత్సవ కమిటీని అయినా ఏర్పాటు చేస్తారు అనుకున్న తరుణంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఉత్సవ కమిటీ కూడా ఏర్పాటు చేసే అవకాశం కన్పించడం లేదు.

నిధుల విడుదల సందేహమే…
జాతర ఉత్సవాలకు ప్రతిఏటా సుమారు కోటి రూపాయల వరకు ప్రభుత్వం విడుదల చేసేది. అయితే ఈసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో జాతరకు నిధులు విడుదల చేస్తారా లేదా అన్నది సందేహం కలుగుతుంది.
పాలకవర్గం తోనే జాతరకు సజావుగా ఏర్పాట్లు
పాలకవర్గం ఉన్నట్లయితే జాతర ఏర్పాట్లు సజావుగా జరిగే అవకాశం ఉండేది. స్థానికంగా ఉన్న నాయకులకే పాలక మండలిలో చోటు లభించేది. కావున దేవస్థానం పరిసరాలు, సౌకర్యాల కల్పన, జాతర పనులు వేగవంతంగా కొనసాగించడం వంటి వాటిపై పూర్తి అవగాహన ఉంటుంది. జాతర విజయవంతానికి తగిన సలహాలు సూచనలు దేవదాయ శాఖ అధికారులకు ఇవ్వడం తద్వారా జాతరను విజయవంతం చేయడం పాలకమండలితో సాధ్యం.
కొత్త ఈ.ఓ తో జాతర నిర్వహణ సాధ్యమేనా. .?
దేవస్థానం వద్ద భక్తులకు సౌకర్యాల కల్పనలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఈవో చంద్రశేఖర్ ఈమధ్యే ఏడుపాయలకు రావడం, అందులోనూ పాలకమండలి లేకపోవడంతో జాతర ఉత్సవాల నిర్వహణ సాధ్యమేనా అన్న సందిగ్ధత స్థానికుల్లో నెలకొంది. జాతర విజయవంతం కావాలంటే అయితే పాలకవర్గం ఉండాలి లేదంటే ఏడుపాయల దేవస్థానం పై పట్టున్న అధికారి అయినా ఉండాలి. గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఈఓ లను నియమిస్తే జాతర సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని స్థానికుల ఆరోపణ. గతంలోనూ పాలకవర్గం లేకున్నా అనుభవం కలిగిన ఈఓలతో జాతర సక్సెస్ ఐన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా జాతరను విజయవంతం చేయడానికి అనుభవం ఉన్న ఈఓ ను నియమిస్తే మంచిదని పలువురు భావిస్తున్నారు.