Monday, November 4, 2024
spot_img

ఫీజుల నియంత్రణేది.?

Must Read
  • క్వాటర్‌ ధర నిర్ణయించారు.. కానీ, స్కూలు ఫీజులు నిర్ణయించలేకపోయారు…
  • కార్పోరేట్‌’ దోపిడీ అడ్డుకునేదెవరూ
  • ఎల్‌.కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అధిక ఫీజులు
  • ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీలకు లేని ఫీజు స్ట్రక్చర్‌
  • కే.జీకి రూ.50 వేల నుంచి లక్షల్లో వసూలు
  • కార్పోరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ కు రూ.2 నుంచి రూ.3లక్షల పైమాటే..
  • అందినకాడికి దోచుకుంటున్న వైనం
  • విద్య హక్కు చట్టం 2009 అమలు జాడేది.?
  • స్కూల్‌ ఎడ్యూకేషన్‌, ఇంటర్‌ బోర్డుల అధికారుల నిర్లక్ష్యం
  • సర్కారు మారిన, విద్యావ్యవస్థలో కనిపించని మార్పు
  • నిద్రమత్తులో ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు

తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే రోజులు పోయి చదువును కొనే రోజులు వచ్చినయి. పేదోడి పిల్లవాడిని బడికి పంపుదామంటే సర్కారు బడుల్లో మాస్టర్లు లేక, ఉన్నా సమయానికి రాక, పాత గోడలు ఎప్పుడు కూలి మీదపడపోతాయే తెలియక, తాగేటందుకు మంచినీళ్లు ఉండక, ఆడపిల్లలు కాలకృత్యాలకు వెళ్దామంటే బాత్రూంలు అసలే లేక గుక్కపట్టి ఓర్చుకోవాల్సిన దుస్థితి. అరె ఇంకేంది ఇన్ని సౌవలత్‌ లు ఉన్నంక.. ఎవరన్నా వచ్చి గవర్నమెంట్‌ పాఠశాలకు పొరగాండ్లను తోలుతారని అడిగేటోన్ని దేనితో కొట్టాల్నో మీరె చెప్పాలె. ‘జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్లు’ ఉంటది రాష్ట్రంలో సర్కారు చదువు పరిస్థితి. పోనీ ఈ సంగతి ఇట్లుంటే.. కూలొ నాలొ చేసుకొని బతికే భార్యభర్తలు పిల్లలను ప్రయివేటు స్కూల్‌లో చేర్పింద్దామంటే బడి గేటు కూడా దాటే పరిస్థితి కానరాట్లేదు. కార్పోరేట్‌ వ్యవస్థల మాయజాలంతో విద్యావ్యవస్థనే భ్రష్టుపట్టిపోయింది. ఒకవేళ దైర్నం జేసి బడ్లో చేర్పిద్దామని వెళ్తే చాలు.. ముందుగాల్నె అడ్మిషన్‌ పేరుతో వేలల్లో వసూలు చేస్తరు. ఇగ అంతేకాదు ముందుంది ముసల్ల పండగ. ఎల్‌.కేజీ నుంచి ఇంటర్మీడియట్‌ దాకా ఫీజుల జోలి తీసేతట్టు లేదు. కేజీ సెక్షన్‌ కే రూ.50వేల నుంచి 1లక్షకు పైనే కానీ తక్కువ లేదంటే అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతుంటే ప్రభుత్వం ఏం జేస్తుంది అని మాత్రం అడగొద్దు. విద్యాహక్కు చట్టం 2009 అమలు కావట్లేదా.. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజు నియంత్రణ లేదా అని క్వశ్చన్‌ లు వేస్తే.. అబ్బే లేదు.. మేం ఫీజు స్ట్రక్చర్‌ ఇంకా తయారు చేయలే.. నిమ్మలంగా చేత్తం.. వచ్చే విద్యా సంవత్సరం దాకా ఆగరాదు, తొందరెందుకు అనే సమాధానం వస్తదీ ఎడ్యూకేషన్‌ బోర్డు నుంచి. ‘ఎలుక తోక తెచ్చి ఎన్నినాళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు’ అన్నట్టు ఎన్ని ప్రభుత్వాలు మారిన విద్యా వ్యవస్థ తీరు మారదు అనేది సుస్పష్టం.రాష్ట్రంలో విద్యను ప్రైవేటు పరం జేసింది ప్రభుత్వం. స్కూల్‌, ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అలసత్వం మూలంగా ఫీజు నియంత్రణ లేకుండా పోయింది. ‘నీకింత – నాకింత’ అన్నట్టుగా ప్రభుత్వ అధికారులు మాముళ్ల మత్తులో జోగుతున్నారనేది బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కేజీ నుంచి ఇంటర్‌ వరకు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ పేద ప్రజల్ని జలగల్లా పట్టిపీడిస్తున్నారు. కార్పోరేట్‌ సిస్టంలో సామాన్య, మధ్యతరగతి పిల్లలను ప్రైవేటు స్కూల్‌లో చేర్పించడం కలగానే మిగిలేటట్టు ఉంది. కేజీ సెక్షన్‌కి ఇంత ఫీజు, 1 నుంచి 5వ తరగతి వరకు, 6 నుంచి టెన్త్‌ క్లాస్‌ దాకా, అలాగే ఇంటర్మీడియట్‌లో ఫీజు ఈ విధంగా వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు (ఫీజు స్ట్రక్చర్‌) పెట్టాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 25% కోటా కింద ప్రైవేట్‌ పాఠశాలలు పేద పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రైవేటు స్కూల్స్‌ లో కనీస సౌకర్యాలు లేవు.. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విశాలమైన తరగతి గదులతో కూడిన సొంత భవనం కలిగి ఉండి, ఆట స్థలం ఉన్న పాఠశాలలకు మాత్రమే ఎడ్యుకేషన్‌ బోర్డు పరిష్మన్‌ ఇవ్వాలి. కానీ విద్యాశాఖ అధికారులు మాముళ్లు తీసుకొని ఎలాంటి వసతులు లేకున్నా గానీ స్కూల్‌, కాలేజీకి అనుమతులు ఇచ్చేస్తున్నారు. అంతేకాకుండా వాటిపై నియంత్రణ కూడా పెట్టకపోవడం గమనార్హం.

2024-25 విద్యా సంవత్సరం నేటి (జూన్‌ 12)తో ప్రారంభం అవుతుంది. ‘దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు’ అన్నట్టు కొత్త విద్యా సంవత్సరం వచ్చి స్కూల్స్‌, కాలేజీలలో అడ్మిషన్లు పూర్తి అయినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఫీజు స్ట్రక్చర్‌ డిసైడ్‌ చేయక పోవడం విడ్డూరంగా ఉంది. దీంతో కార్పోరేట్‌ స్కూళ్లు, కాలేజీలు అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇంటర్మీడియట్‌కు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. రెజోనెన్స్‌ కాలేజీలో ఫస్ట్‌ ఇయర్‌కు రూ. 3.50లక్షలు, నారాయణలో రూ. 2.5 నుంచి రూ. 3లక్షలు, శ్రీచైతన్యలో రూ. 1.50 లక్షల నుంచి రూ. 2లక్షల వరకు ఫీజులు, అవినాష్‌ కాలేజీలో రూ. 70 వేల వసూలు చేస్తుండడం గమనార్హం. రెండు సంవత్సరాలకు కలిపి రూ.4 నుంచి 7లక్షల వరకు వ్యయం చేయాల్సిన దుస్థితి. ఈ ఫీజుల మాటలు వింటుంటే పిల్లల పేరెంట్స్‌ గుండెల్లో గుబులు మొదలైతుంది. ఇంటర్మీడియట్‌ నిర్ణయించిన ఫీజుల ప్రకారం కేవలం రూ.1,760 మాత్రమే చెల్లించాలి. లక్షల్లో ఫీజులు పెట్టి పిల్లలను చదివించాల్సి వస్తుంది. ‘నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది’ అన్నట్టు ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులకు మామూళ్లు ఇస్తున్నరు కాబట్టి కార్పోరేట్‌ స్కూల్స్‌, కాలేజీల హవా నడుస్తోంది అనే ఆరోపణలు ఉన్నాయి.

తెలంగాణలో విద్యావ్యవస్థను కార్పోరేట్‌ కాలేజీలు, స్కూల్స్‌ సత్తెనాశ్‌ చేశాయి. ఇంత జరుగుతున్నా ఎడ్యుకేషన్‌ బోర్డు ఏం చేస్తుంది అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. అసలు ఏం జరుగుతుందో తెలియని దుస్థితిలో ఎడ్యుకేషన్‌ వ్యవస్థ ఉండడం గమనార్హం. విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు, కమిషనర్‌, ఇతర ఉన్నతాధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు అనే అపవాది మూటగట్టుకుంటున్నారు. లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఎడ్యుకేషన్‌ బోర్డులో పనిచేసే ఉన్నతాధికారులు కనీసం ప్రైవేటు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకపోవడంపై మేధావులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చొరవ చూపి కార్పోరేట్‌ స్కూల్స్‌, కాలేజీలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను కట్టడిచేసి ఫీజుల నియంత్రణ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

Latest News

ప్రశ్నిస్తే కేసులు పెట్టి బెదిరిస్తారా

ప్రజాపాలన అంటే ప్రతిపక్షం గొంతు నొక్కడమా? శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులపై కేసులు దారుణం ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్‌ రావు ప్రజాపాలన అంటే ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS