ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని హాలీవుడ్, బాలీవుడ్ సినిమా పరిశ్రమకు అడ్డాగా మార్చడానికి ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినీ పరిశ్రమ రాణించడానికి నిర్దేశిత లక్ష్యాలతో ఒక చాప్టర్ ఉండాలని, అందుకు సినీ ప్రముఖులు అవసరమైన ప్రణాళికను తయారు చేయాలని కోరారు.
హైదరాబాద్ హైటెక్స్‌లో కన్నుల పండుగగా సాగిన ప్రతిష్టాత్మక “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024” ప్రదానోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు గార్లతో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

“స్వాతంత్రం సిద్ధించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి దేశం ఆర్థికంగా బలోపేతం కావాలంటే సినిమా రంగం కూడా ఒక పరిశ్రమగా రాణించాలి. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే 10 ఏళ్ల నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించాలంటే సినీ పరిశ్రమ కూడా అభివృద్ధి సాధించాలి.
సినిమా రంగం అభివృద్ధి సాధించడానికి పరిశ్రమకు ఏం కావాలో చెప్పండి. ఏ హోదాలో ఉన్నా మీకు అండగా నిలబడుతా. అన్ని రకాల ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. తెలంగాణకు ఎవరైనా రావొచ్చు. ఎవరైనా వాణిజ్యం నిర్వహించవచ్చు. 500 ఫార్చూన్ కంపెనీల్లో 85 కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ నగరాలతో పోటీ పడదలచుకున్నాం.

తెలుగు సినీ పరిశ్రమలను గుర్తించడానికి 1964 లో ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించి అప్పటి నుంచి 2014 వరకు నిరాటంకంగా నిర్వహించారు. వివిధ కారణాల చేత 14 ఏళ్ల కిందట ఆగిపోయిన సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని పునరుద్దరించాలని #DilRaju గారు ప్రతిపాదించారు. వాటిని పునరుద్దరించడమే కాకుండా గడిచిన పదేండ్ల కాలంలో ప్రతిభ కనబరిచిన అందరినీ అభినందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అందుకు సహకరించిన సినీ రంగానికి అభినందనలు.
కొన్ని అంశాల్లో ప్రభుత్వ నిర్ణయాలు కఠినంగా కనిపిస్తాయి. కానీ ప్రభుత్వం సినిమా రంగాన్ని అభిమానంగా చూస్తుంది. ఇప్పుడే కాదు గతంలోనూ మా ప్రభుత్వాలు సినిమా రంగాన్ని గౌరవించింది. ఇంత అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వహకులకు, అందుకు సహకరించిన సినీ రంగ ప్రముఖులందరికీ అభినందనలు.

గద్దరన్న స్ఫూర్తితో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. తెలంగాణ అభివృద్ధిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యం కావాలి. అందరం కలిసికట్టుగా తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలి. తెలంగాణను అభివృద్ధి వైపు నడిపించడంలో కళా చైతన్యం తోడుగా నిలవాలి..” అని ముఖ్యమంత్రి గారు కోరారు.
2014 నుంచి 2024 వరకు ప్రతి ఏటా ఆయా కేటగిరీల్లో ఎంపికైనా ఉత్తమ చిత్రాలతో పాటు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమలో విశేష కృషి చేసిన ప్రముఖులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా GaddarFilmAwards అందజేశారు.
