- సర్వే నెం. 212/1లోని 26 ఎకరాల 12గుంటలలోని కొంత ప్రభుత్వ భూమి కబ్జా
- రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, తుర్కయంజాల్ లో లేక్‌వ్యూ పేరుతో అక్రమ వెంచర్
- జీఓ నెం.58, 59కు తూట్లు.. సర్కారు భూమిని కాపాడలేని అధికారులు
- అక్రమంగా దోచేసుకున్న మానేపల్లి రియాల్టీ & ఇన్‌ఫ్రా
- జ్యువెలరీ షాపులలో జనాల్నీ దోచుకుతిన్నది చాలక.. గవర్నమెంట్ భూమిని ఖతం చేసిన వైనం
- ప్రభుత్వ భూమిలో ప్లాట్స్, బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం
- పేద, అమాయక ప్రజలకు అమ్మజూపుతూ కోట్లు గడిస్తున్న మానేపల్లి
- మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా సంస్థ కబ్జాపై విచారణకు డిమాండ్
రాష్ట్రంలో సర్కారు భూములను కాపాడే వారే లేరు. ఎక్కడ ప్రభుత్వ, అసైన్డ్ భూములు కనపడితే కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ, అసైన్డ్, పేదలు, అమాయకుల భూములను కొట్టేస్తున్న అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారు. రాజధాని నగరంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాకోరులకు ఆశలు పుట్టుకొస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి చుట్టూ ఉన్న దేవాలయాల భూములను అక్రమార్కులు పొతం పెడుతున్నారు. దేవుడి భూములను సైతం యథేచ్ఛగా భూముల కబ్జాకు పాల్పడుతున్నారు. డబ్బు, రాజకీయ బలంతో కొందరు భూములను కబ్జా పెడుతున్నారు. మాముళ్లు ముట్టజెప్పుతూ అధికారులను మచ్చిక చేసుకొంటున్నారు. అక్రమ మార్గంలో సర్కారు భూములను సొంతం చేసుకుని వాటి స్థానాల్లో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. రూ. రెండూ, మూడు లక్షలకు 121గజాలు అంటూ బ్రోచర్లు, యాడ్స్ ద్వారా ప్రచారం చేసుకుంటూ అమాయక ప్రజల్నీ మోసం చేస్తున్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా సంస్థ(Manepally Realty and Infra).. ఈ పేరు వింటేనే మానేపల్లి జ్యువెలర్స్, భువనగిరిలోని స్వర్ణగిరి టెంపుల్ గుర్తొస్తాయి. తెలంగాణలో పలు బ్రాంచీలు ఏర్పాటు చేసి, బంగారం బిజినెస్ లో రూ.కోట్లు వెనకేశారు. దాని మాటున, హిందువుల సానుభూతి పొందెందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ‘యాదాద్రి తిరుమల దేవస్థానం’ స్వర్ణగిరి టెంపుల్ నిర్మించారు. దేవుడా.. దేవుడా.. అంటూ దేవుడి గుళ్లో గోపురం ఎత్తుకెళ్లినట్లు ఉన్నది. జ్యువెలరీ షాపులలో జనాల్నీ దోచుకుతిన్నది చాలక.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రవేశించి.. ప్రజలను మోసం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. దీని ద్వారా పెద్ద పెద్ద వెంచర్లు చేసి ప్లాట్స్, బహుళ అంతస్థుల భవనాల నిర్మాణం చేపడుతున్నారు. తద్వారా మానేపల్లి పేద, అమాయక ప్రజలకు అమ్మజూపుతూ కోట్లు గడిస్తున్నారు. అధికారులకు మాముళ్లు అప్పగించి గవర్నమెంట్ భూమిని ఖతం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, తుర్కయంజాల్ గ్రామంలో మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా పేరుతో అక్రమ వెంచర్ ఏర్పాటు చేస్తున్నారు. తుర్కయంజాల్ లో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని మానేపల్లి కబ్జా గురిచేశారు. సర్వే నెం. 212/1లోని 26 ఎకరాల 12 గుంటల భూమి ఉంది. అందులో కొంత భూమిని మానేపల్లి సంస్థ అక్రమంగా మాయం చేసింది. జీఓ నెం.58, 59కు తూట్లు పొడుస్తూ భూమిని కొల్లగొట్టారు. వాస్తవంగా ఈ జీఓ కింద అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వం భూమి కేటాయిస్తుంది. ప్రభుత్వ, అసైన్డ్ భూమిలో ఏళ్లుగా నివాసం ఉంటూ, గుడిసె, తాత్కాలిక ఇల్లు నిర్మించుకొని ఉంటున్న నిరుపేద, అణగారిన వర్గాల వారికి ప్రభుత్వం ఉదారంగా ఆలోచించి జీఓ నెం.58, 59 ద్వారా రెగ్యులరైజ్ చేస్తుంది. “అడుక్కునేవాడింటికి బుడబుక్కల వాడు వచ్చినట్టు” మానేపల్లి పేదల పేరుతో భూములను అక్రమంగా రెగ్యులరైజ్ చేసుకున్నారు. రాత్రికి రాత్రి చిన్న రూమ్ లు నిర్మించి, అప్పటికప్పుడే కరెంట్ మీటర్లు పెట్టించి రెవెన్యూ అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పగించి అక్రమ మార్గంలో రెగ్యులర్ చేసుకున్నారు.

భూములు అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు అని అందరూ ఇదే పనిచేస్తున్నారు. ఈ కోవకు చెందినదే మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా కంపెనీ. రియల్ ఎస్టేట్ సంస్థలు జనాల్నీ మోసం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి. నగర రాజధాని హైదరాబాద్ కి ఆనుకొని ఉన్న రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు బాగా డెవలప్ అయ్యాయి. సాప్ట్ వేర్ సహా ఇతర అంతర్జాతీయ కంపెనీలు భాగ్యనగరంలో స్థాపించడం, సిటీలో మూడు లైన్ల మెట్రో సదుపాయం, పట్నం చుట్టూ ముట్టూ ఓఆర్ఆర్ ఉండడంతో ఓ రేంజ్ లో ఎదిగింది. రియల్టర్లు రేపో, మాపో హైదరాబాద్ లో కలిసిపోతుంది, సిటీ పెరుగుతుంది అని నమ్మిబలికే మాయమాటలకు చాలా మంది బోల్తా పడుతున్నారు. మంచి మంచి కవితలతో కొటేషన్స్, కలర్ ఫుల్ బ్రోచర్లు, సెలబ్రిటీలతో యాడ్స్ చేయిస్తూ రియల్ ఎస్టేట్ సంస్థలు జనాన్ని దోచుకు తింటున్నాయి. హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, కనీస నియమ నిబంధనలు, ప్రభుత్వ గుర్తింపు లేకుండానే బిజినెస్ చేస్తున్నది మానేపల్లి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ, అసెన్డ్ భూములు, దేవాదాయ, అటవీ, చెరువు, శిఖం భూములను రక్షించాల్సిన జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎండోమెంట్, ఫారెస్ట్ అధికారులు నిద్రమత్తులో ఉన్నారు.

ఇకనైన మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా సంస్థ అక్రమంగా కబ్జాపెట్టిన ప్రభుత్వ భూమిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. మానేపల్లికి కోట్ల రూపాయల భూమిని అప్పనంగా అప్పగించిన రెవెన్యూ, ప్రభుత్వ అధికారులను విధుల్లోంచి తొలగించాలని, మానేపల్లి రియల్ ఎస్టేట్ సంస్థ మేనేజ్ మెంట్ పై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయంపై మానేపల్లి రియాల్టీ అండ్ ఇన్ ఫ్రా సంస్థ యాజమానం వివరణ కొరకు ఆదాబ్ ప్రతినిధి ఫోన్ చేయగా స్పందించడం లేదు.. ఎమ్మార్వో వివరణ ఇస్తూ జీవో58, 59 కు తూట్లు పొడిచి అప్పటి తహసీల్దార్‌లు అక్రమంగా అప్పగించారు. ఈ విషయంపై ఫిర్యాదులు అందాయి.. ఉన్నతాధికారులతో చర్చలు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.