- మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారు
- 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో పర్యటన
- 12, 13 తేదీల్లో అమెరికాలో టూర్
ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్, అమెరికా పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10నుంచి 12వ తేదీ వరకు ఫ్రాన్స్‌లో, 12, 13 తేదీల్లో అమెరికాలో ఆయన పర్యటిస్తారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. పారిస్‌లో జరిగే కృత్రిమ మేధ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన మోడీ ఫ్రాన్స్‌కు బయల్దేరి వెళ్లనున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ తో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారని తెలిపారు. కెడారచీ థర్మో న్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్‌ను ప్రధాని పరిశీలించనున్నారని మిస్రీ తెలిపారు. అనంతరం 12వ తేదీ సాయంత్రానికి వాషింగ్టన్ డీసీకి చేరుకోనున్న మోడీ.. 13వ తేదీన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారని సమాచారం. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భేటీ కాబోతున్న ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా ఆయనతో పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశముంది. పలు దేశాలపై ట్రంప్ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో మోడీ అమెరికా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.