- ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్
- ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌ల భూములను వదల్లే
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రొహిబిటేడ్ లిస్టులో ఉన్నా డోంట్ కేర్
- రాజకీయ నాయకుల అండతో లేఅవుట్
- షాబాద్ మండలం తిమ్మరెడ్డిగూడలో డొళ్ల వ్యాపారం
- అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్న ఇరిగేషన్ శాఖ
- ప్రేక్షకపాత్రలో రెవెన్యూ శాఖ అధికారగణం
మైరాన్ చెరుబిక్ ఈ పేరు వినే ఉంటారు… ఇదో పెద్ద రియల్ కంపెనీ. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పెద్ద వెంచర్లు చేస్తుంటుంది. అక్కడ చెరువు ఉన్నా… భూదాన్ పట్టాలు ఉన్నా.. అవి ప్రొహిబిటెడ్ లిస్టు ఉన్నా… పట్టాలు చేసుకుంటుంది. అందమైన రంగురంగుల బ్రౌచర్లు రూపొందించి ఫాం ప్లాట్ల పేరుతో అమాయకులకు అమ్మేస్తుంటుంది. ఇందుకు నిలువెత్తు సాక్షం రంగారెడ్డి జిల్లా, షాబాద్ మండలంలోని తిమ్మడ్డిగూడ గ్రామంలో మైరాన్ చెరుబిక్ వెంచర్. తాళ్లపల్లి రెవెన్యూ పరిధి తిమ్మరెడ్డిగూడ గ్రామంలోని లింగారెడ్డి చెరువుకు ఆనుకొని ఉన్న ఈ వెంచర్ కు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా లేదు. మరి ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పంచాయతీ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఏం చేస్తున్నారనే కదా… డౌట్…! ఏముంది యథావిధిగా ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే ఇందుకు పలువురు సంబంధిత అధికారులు, కొందరు నాయకులు సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రికార్డుల్లో భూదాన్ భూమి..!
మైరాన్ ఏర్పాటు చేసిన వెంచర్లలోని పలు సర్వే నెంబర్లు రికార్డు ప్రకారం భూదాన్‌గా చూపిస్తున్నాయి. సర్వే నెం. 464లో 15.33 ఎకరాలు, సర్వే నెం. 469లో 16.1 ఎకరాల భూమి భూదాన్‌లో భూమి ఉంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్, స్టాంప్స్ ప్రొహిబిటెడ్ లిస్టులో జీవో నెం. 1284 26-09-2007 ప్రకారం భూదాన్ అని క్లియర్ గా ఉంది. అప్పట్లో ఈ భూమిలో ఎలాంటి క్రమ, విక్రయాలు జరగకుండా ప్రభుత్వం నిషేధిత జాబితాలో పొందుపర్చడం జరిగింది. అయితే ఇందులో కొందరు రైతులు 1977లో ఆర్డీవో నుంచి ఓఆర్‌సీ తీసుకున్నారు. అయినప్పటికీ ప్రస్తుతం కూడా ఈ భూమి ప్రొహిబిటేడ్ జాబితోలోనే కనిపిస్తోంది. కానీ ఎలా మేనేజ్ చేశారో ఏంటో గాని భూమిని కొనుగోలు చేసి వెంచర్ ఏర్పాటు చేసి అమ్మకాలు జరిపారు.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కూడా..
464, 466 సర్వే నెంబర్లలో కొమటికుంట చెరువుకు సంబంధించిన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ కూడా ఉంది. 464లో 4 ఎకరాల 21 గుంటల ఎఫ్‌టీఎల్‌తో పాటు 29 గుంటల బఫర్ జోన్ ఉంది. 466 సర్వే నెంబర్‌లో 2.6 ఎకరాల ఎఫ్‌టీఎల్, 19 గుంటల బఫర్ జోన్ ఉందని అధికారులు నిర్ధారించి, నివేదిక సమర్పించిన కూడా, ఇవేవీ పట్టించుకోకుండా.. కేవలం రైతులకు ఉన్న పట్టాలను ఆసరా తీసుకొని యథేచ్ఛగా వెంచర్ చేశారు. అటు భూదాన్ బోర్డును ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులను భారీ ఎత్తున ముడుపులు ఇచ్చి మేనేజ్ చేసినట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
అనుమతుల్లేవ్….
రియల్ ఎస్టేట్ కంపెనీలు వెంచర్ చేయాలంటే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందాలి. లేదా డీటీసీపీ లేఅవుట్ అయినా ఏర్పాటు చేయాలి. కానీ, ఇక్కడ చేసేది ఫాం ప్లాట్లు. అంటే గజాల్లో రేటు పెట్టి గుంటల్లో రిజిస్ట్రేషన్ చేస్తారన్నట్లు. ఇందుకు గ్రామపంచాయితీ నుంచి పర్మిషన్ తీసుకుంటారు. కానీ ఈ వెంచర్ విషయంలో పంచాయతీరాజ్ అధికారులే హెచ్ఎండీఏ నుంచి అనుమతులు తీసుకోవాలని లేదంటే కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. ఒక్కసారి కాదు మూడు నాలుగు సార్లు ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఇందుకు సమయం కూడా ఇచ్చామని అయినా వాళ్లు స్పందించలేదని అంటున్నారు.. అయితే ఇందులో ఉన్న మతులబు ఏంటో అందరికీ తెలిసిందే….
ఇప్పటికైనా ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి మైరాన్ చెరుబిక్ సంస్థపై చట్టప్రకారం చర్యలు తీసుకొని భూదాన్ భూములను, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే చెరువును కాపాడవల్సిందిగా ప్రజలు కోరుతున్నారు.