(కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ)
- ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కూతవేటులో భూ కబ్జా
- కళ్లు మూసుకున్న జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు!
- అనుమతులు ఒకచోట, నిర్మాణం మరోచోట
- నిర్మాణ సంస్థ పై చట్ట ప్రకారం చర్యలు శూన్యం !
- మాముళ్లమత్తులో జోగుతున్న ప్రభుత్వ అధికారగణం
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు అతి సమీపంలో, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ యథేచ్ఛగా కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు బాలానగర్ రెవెన్యూ అధికారులు కళ్లు మూసుకుని కూర్చోవడం ప్రజల ఆగ్రహానికి దారితీస్తోంది. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, ఉన్నతాధికారుల అండదండలతో జరుగుతున్న పచ్చి అవినీతి అని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. అనుమతి ఒకచోట, నిర్మాణం మరోచోట చేస్తూ.. నిస్సిగ్గుగా ప్రభుత్వ భూమి కబ్జా చేసిన నవయుగ అరాచకంపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బాలానగర్ మండలం, బేగంపేటలోని సర్వే నంబర్ 103/1, 103/2లో సుమారు 12,600 గజాల స్థలంలో 4 సెల్లార్+1 గ్రౌండ్+12 అప్పర్ ఫ్లోర్స్ నిర్మాణానికి నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ 2022లో (పర్మిట్ నెంబర్: 2500/జీహెచ్‌ఎంసీ/సికింద్రాబాద్/2022 – బీపీ) అనుమతులు పొందింది. అయితే, పర్మిట్ పొందిన స్థలంలో కాకుండా, పక్కనే ఉన్న సర్వే నంబర్ 192లోని సుమారు 6000 గజాల ప్రభుత్వ స్థలాన్ని నిస్సిగ్గుగా కబ్జా చేసి, దానిలో భారీ నిర్మాణాన్ని చేపడుతోంది. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ప్రభుత్వ భూమి ఇలా అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లడం విస్మయం కలిగిస్తోంది.
కుమ్మక్కు రాజకీయమా? అధికారుల అంధత్వం వెనుక బాగోతం!
జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతులు ఒకచోట ఇచ్చి, నిర్మాణం మరోచోట జరుగుతున్నా కనీసం పట్టించుకోకపోవడం, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా అంధత్వంతో వ్యవహరించడం వెనుక భారీ కుమ్మక్కు జరిగిందని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాయడం అత్యంత దారుణమని, ఇది పచ్చి అవినీతికి నిదర్శనంగా కనిపిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు. లక్షల మంది ఆశలు, ఆస్తుల భవిష్యత్తును నిర్ణయించే అధికారులు ఇలా అవినీతిలో కూరుకుపోవడం ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది.

బీఎన్ఎస్ చట్టం ప్రకారం ఎలాంటి చర్యలుంటాయి?
ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. ఈ చట్టం కింద కింది చర్యలు తీసుకోవచ్చు:
- అక్రమ ఆక్రమణ: బీఎన్ఎస్ సెక్షన్ 342 ప్రకారం, ఎవరైనా ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఆక్రమించుకుంటే, వారికి జైలు శిక్ష విధించబడుతుంది, ఇది 3 సంవత్సరాల వరకు పొడిగించబడవచ్చు, లేదా జరిమానాతో లేదా రెండింటితో శిక్షించబడవచ్చు. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసింది కాబట్టి, ఈ సెక్షన్ కింద శిక్షార్హం.
- అపరాధ ప్రవేశం : బీఎన్ఎస్ సెక్షన్ 329 ప్రకారం, ఎవరైనా వేరొకరి ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించి, ఆస్తిదారుడికి నష్టం కలిగించే ఉద్దేశ్యంతో ప్రవేశిస్తే అది అపరాధ ప్రవేశం కిందకు వస్తుంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కూడా ఈ సెక్షన్ కిందకు వస్తుంది, దీనికి జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
- ప్రజా ఆస్తుల విధ్వంసం నిరోధక చట్టం : ఇది నేరుగా బీఎన్ఎస్ పరిధిలో కానప్పటికీ, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించినప్పుడు ఈ చట్టం వర్తిస్తుంది. అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ప్రభుత్వ భూమికి నష్టం వాటిల్లినట్లయితే, ఈ చట్టం కింద కూడా చర్యలు తీసుకోవచ్చు.
- కుట్ర : ఈ వ్యవహారంలో అధికారులు మరియు నవయుగ కంపెనీ మధ్య కుమ్మక్కు జరిగినట్లు ఆరోపణలు ఉన్నందున, బీఎన్ఎస్ సెక్షన్ 61 ప్రకారం కుట్ర నేరం కింద కూడా కేసులు నమోదు చేయవచ్చు. ఇది నిర్దిష్ట నేరానికి విధించే శిక్షతో సమానంగా ఉంటుంది.
- అధికారుల నిర్లక్ష్యం,అవినీతిపై చర్యలు: ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులపై బీఎన్ఎస్ తో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా చర్యలు తీసుకోవచ్చు. వారు తమ విధులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇది ఉద్యోగాల నుండి తొలగింపు మరియు జైలు శిక్షకు కూడా దారితీయవచ్చు.

తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం!
ఈ అక్రమ నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, నవయుగ ఇంజనీరింగ్ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, ఈ అక్రమానికి బాధ్యులైన టౌన్ ప్లానింగ్ అధికారులపై, రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రభుత్వం ఈ విషయంపై తక్షణమే జోక్యం చేసుకొని, సమగ్ర విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజలు సూచిస్తున్నారు. లేనిపక్షంలో, ఇది ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజార్చి, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయేలా చేస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎంత వేగంగా స్పందించి, అక్రమార్కులకు ఎలాంటి గుణపాఠం చెబుతుందో వేచి చూడాలి.