- చారిత్రాత్మక సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
- ఆధ్యాత్మిక వారసత్వానికి పెద్దగట్టు జాతర పెట్టింది పేరు
- టాఫిక్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దగట్టు జాతర ప్రతీక అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం దురాజ్ పల్లి పెద్ద గట్టు లింగమంతుల స్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయకమిటీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఆలయప్రాంగణంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భక్తులతో కలిసి భేరి మ్రోగించారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రంలో సమ్మక్క-సార క్క తరువాత దూరాజపలి పెద్దగట్టు జాతర అంతటి ప్రాశ స్త్యం కలిగిందన్నారు. చారిత్రాత్మక సంప్రదాయాల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 16 వ శతాబ్దంలో మొదలైన ఈ జాతర పురాతన సంస్కృతి, సంప్ర దాయాలను ప్రతిబింబింప చేస్తుందన్నారు. అటువంటి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జరిగేలా రెండేళ్ళకు ఒక మారు జరుగుతున్న ఈ జాతరకు భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరను పురస్కరించుకుని రూ.ఐదు కోట్లు కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రం నలుమూలల నుండి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుండి 30 లక్షల పై చిలుకు భక్తులు ఈ పూజలలో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని అన్నారు. అందుకు తగినట్లుగానే మౌలిక సదుపా యాల కల్పనతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక సిబ్బందిని నియమించామ న్నారు.
ఈ సందర్భంగా తాగునీటి సరఫరా, పారి శుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సహా యం, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. భక్తుల రాకపోకలతో పాటు వారి అవసరాల కోసం ప్రత్యేక పర్యవేక్షణ పెట్టడంతో పాటు తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు, వైద్య శిబిరాలు, క్యూ నిర్వహణ వ్యవస్థలను సమర్థంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. వాహనాల రద్దీతో ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా ఉండేందుకు గాను హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేశారన్నారు. అదనపు పోలీస్ సిబ్బందితో పాటు పర్యవేక్షణ నిమిత్తం సిసి కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని కఠిన ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. విజయవాడ వెళ్ళే వాహనాలను నార్కట్‌పల్లి, మిర్యాలగూడ, కోదాడ మార్గం ద్వారా మళ్లించారు, అలాగే విజయవాడ నుండి హైదరాబాదుకు వచ్చే వాహనాలను కోదాడ, మిర్యాలగూడ, నల్గొండ మార్గం ద్వారా మళ్లించారన్నారు. భారీ వాహనాలను జాతర ప్రాంగణానికి సమీపంలో నిలిపివేయ కుండా చర్యలు తీసుకున్నట్లు అన్నారు.
ఆరోగ్యపరంగా అత్యవసర చికిత్సల నిమిత్తం ప్రత్యేక వైద్య బృందాలతో పాటు అత్యవసర వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, శుభ్రత కోసం ప్రత్యేకించి పారిశుద్ధ్య కార్మికులను నియమించారని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ నరసయ్య యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కొప్ఫుల వేణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.