- సుమారు రూ.100 కోట్లు కొల్లగొట్టిన సాస్ ఇన్ఫ్రా సంస్థ
- రంగురంగుల బ్రోచర్లతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న వైనం
- కూకట్‌పల్లి, కొల్లూర్ లో హైరేజ్ టవర్స్ పేరిట మోసం
- పట్టించుకోని రెవెన్యూ, సంబంధిత అధికారులు..
- నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రీ లాంచ్ మోసాలు
హైదరాబాద్‌లో రోజురోజుకు ప్రీ లాంచ్ మోసాలు పెరుగిపోతున్నాయి.. మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను ఆసరా చేసుకొని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రీ లాంచ్‌ల పేరుతో సామాన్యుడిని నిండా ముంచుతున్నారు. అరచేతిలో వైకుంఠం చూపిస్తూ.. తమవి పెద్ద కంపెనీలంటూ ప్రముఖులతో, రంగురంగు బ్రోచర్లతో ప్రచారం చేసి అందినకాడికి డబ్బులు గుంజేస్తున్నారు. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లతో నిర్మాణ రంగంలో కొంతమంది మోసగాళ్ల పుణ్యమా అని ఇప్పుడు ఆ నమ్మకమే పోయేలా కనిపిస్తోంది. తాజాగా ప్రీ లాంఛ్ ఆఫర్ల పేరుతో సాస్ ఇన్ఫ్రా సంస్థ ప్రజల నుంచి సుమారు రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది..
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరంలోని కొండాపూర్‌లో సాస్ ఇన్ఫ్రా సంస్థ ప్రీ లాంచ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్నారు.. కూకట్‌పల్లిలో 20 ఎకరాల్లో హైరేజ్ టవర్స్, కొల్లూర్ లో 10 ఎకరాల్లో హైరేజ్ టవర్స్ నిర్మాణం చేస్తున్నామని మాయ మాటలు చెబుతూ ఫ్లాట్స్ అమ్ముతున్నారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ అమాయక ప్రజల నుండి సుమారుగా రూ.100 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు తెలుస్తుంది.. సాస్ ఇన్‌ఫ్రాకి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఎంత..? ఈ సంస్థ ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టింది.. అందులో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజలకు అందించింది.. మరిన్ని పూర్తి వివరాలతో మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం.