- ఆటోల రవాణా పన్నులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు..
- వేలల్లో జరిమానాలు విధిస్తున్న అధికారులు..
- దీనిపై తగిన జీఓ తీసుకురావాల్సిన అవసరం ఉంది..
- నగర డిప్యూటీ మేయర్, టీటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్ మోతె శోభన్ రెడ్డికి వినతిపత్రం..
- జీ.హెచ్.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో అందజేసిన స్వచ్ ఆటో,రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
హైదరాబాద్ జిహెచ్‌ఎంసి స్వచ్ ఆటో, రిక్షా కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సోమవారం రోజు గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డికి, టీ.టీ.యు.సి.రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డికి జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వినతిపత్రంలో వీరు ప్రస్తావించిన అంశాలు ఇలా ఉన్నాయి.గత 30 సంవత్సరాలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తున్న స్వచ్ఛ ఆటో రిక్షా కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ద్వారా స్వచ్ఛ ఆటోలను పొందిన కార్మికులు ఇప్పుడు ఆ ఆటోల రవాణా పన్ను చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఆటోల పై రూ. 50,000/-ల నుంచి రూ. 1,00,000/- వరకు జరిమానా విధిస్తున్నారు, ఇది కార్మికులు భరించలేని భారంగా మారింది. గతంలో ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు కమిషనర్ ఆర్టీఓ అధి కారులతో మాట్లాడి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు, కానీ జీవో జారీ చేయకపోవడంతో సమస్య తిరిగి తలెత్తింది. స్వచ్ఛ ఆటోల సీజ్ వల్ల కార్మికుల జీవనాధారం దెబ్బతినడంతో పాటు కాలనీల్లో చెత్త సేకరణ వ్యవస్థలో అంతరాయం కలుగుతుంది. ఇది కాలనీల్లో దుర్వాసన, చెత్త రోడ్ల మీద పడటం వంటి సమస్యలకు దారి తీస్తోంది. రోజువారీ వేతనాలతో ఆటోల నిర్వహణ, పిల్లల చదువు, వైద్యం, కుటుంబ ఖర్చులు నిర్వహించుకోవడం కష్టంగా మారింది. జరిమానాలు చెల్లించడమే కాకుండా స్వచ్ఛ ఆటోలను కొనసాగించడం కూడా కార్మికులకు సాధ్యమయ్యేలా లేదు. కనుక తక్షణమే సీజ్ చేసిన స్వచ్ఛ ఆటోలను విడుదల చేయాలి. ఆర్టీఓ అధికారులు ఆటోలను సీజ్ చేయకుండా శాశ్వతంగా ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. కార్మికుల జీవనోపాధిని కాపా డేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వినతిపత్రాన్ని డిప్యూటీ మేయర్‌కి అందజేసి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వాలని కార్మికులు విజ్ఞప్తి చేశారని.. జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర జిహెచ్‌ఎంసి సెర్చ్ ఆటో, రిక్షా కార్మికులు ఒక ప్రకటనలో తెలియజేశారు..