- రూ. 30 వేల డబ్బుతో చిక్కుకున్న ధరూర్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధారూర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ గౌడ్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. ఓ కేసు విషయంలో రూ.30,000 డిమాండ్ చేసి ఎసిబికి అడ్డంగా బుక్ అయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ధారూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఉప్పరి హన్మంతు, ఉప్పరి బసప్పలు అన్నదమ్ములు. ఉప్పరి బసప్ప కొంతకాలం కింద చనిపోయారు. అప్పటికే అన్నదమ్ములకు చెందిన ఆస్తులను పంచుకున్నారు. హన్మంతు చెందిన ఆస్తులను గతంలోనే అమ్ముకున్నారు. బసప్ప కుమారుడు గోపాల్‌కు చెందిన ఇంటి ముందు హన్మంతు డబ్బా ఏర్పాటు చేశారు. దీంతో బసప్ప కుమారుడు గోపాల్, హన్మంతుల మద్య గొడవలు జరిగాయి. ఇరువర్గాలపై ధారూర్ పోలీస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. అయితే గోపాల్ వర్గంలో నమోదు అయిన కేసులో ఓ వ్యక్తి పేరును తొలగించాలని ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్‌ను సంప్రదించినట్లు బాధితుడు గోపాల్ తెలిపారు. ఈ అతని పేరును తొలగించేందుకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ రూ. 50వేలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. గోపాల్ తమ బందువుతో కలిసి ఏసీబీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రైడ్ చేశారు. ఈ డబ్బులను పోలీస్టేషన్ డ్రైవర్ బీరప్ప అనే వ్యక్తి బాధితుని నుంచి తీసుకున్నట్లు తెలిసింది. డ్రైవర్ ఈ డబ్బులను ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్‌కు అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు పక్కా సమాచారం. ఏసీబీ అధికారులు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్, డ్రైవర్ లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధరూర్ ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ గతంలో తాండూరు పట్టణ ఎస్‌ఐగా పనిచేశారు.