- దార్తి నేచర్ ఫామ్ లో ఊహకందని అక్రమాలు
- అన్ని తామై వ్యవహరించిన అధికారులు రాజకీయ నేతలు
- ధన కుంటను మాయం చేసిన భూ మాయగాళ్లు
- ప్రభుత్వ భూములు కాపాడడం దేవుడెరుగు శిఖం భూములను కాపాడే వారెవరు
- 25ఎకరాల శిఖం భూమిని కబ్జా కోరులకు అప్పజెప్పిన అధికారులు, రాజకీయ నాయకులు
- డిండి మండల కేంద్రంలో హైడ్రా వస్తే బాగుండని మొక్కుతున్న గ్రామ ప్రజలు
- మండల ఎమ్మార్వో కార్యాలయంలో జరిగే అక్రమాలపై మరో కథనంతో మీ ముందుకు
గుండ్లపల్లి(డిండి) మండలం కేంద్రంలో రెవెన్యూ గ్రామ శివారులో గల సర్వే నంబరు 14లో 25.19 ఎకరముల విస్తీర్ణంలో ధన(దండే) కుంట పేరుతో శతాబ్దాలుగా శిఖము కుంట భూమి వున్నది. అట్టి ధనకుంటకు పైన వున్న కొండ ప్రాంతాల నుండి, సుమారు 3000 ఎకరాల పరివాహక ప్రాంతము నుండి సుమారు 11చిన్న,పెద్ద కుంటల ద్వారా వరద నీరు ఈకుంటకు చేరుకుని నిలువచేయబడి తద్వారా ఈకుంట క్రింద సుమారు 300ఎకరముల ఆయకట్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగునీరు అందించబడినది.1950వ సంవత్సరమునకు పూర్వము దుందుభి నది ఆనుకుని విరాజిల్లిన పాత గుండ్లపల్లి గ్రామ పరిసర (పాత ఊరు) ప్రాంతము వరకు ఈకుంట నీటితో గతంలోనే సుమారు150 ఎకరాలు వరి సాగు చేసినారు. సదరు భూమి శిఖం భూమిగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయబడి, కుంట నిర్వహణ చేయబడినది. కానీ కాలక్రమేణా డిండి ప్రాజెక్టు నిర్మాణానంతరము ఈ కుంట యొక్క ఆయకట్టు ప్రస్తుత డిండి ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టుగా మార్పు చెందినది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే:డిండి ఫ్రాజెక్టు నిర్మాణము తర్వాత సరైన నిర్వహణ లేక కుంట తన ప్రాభవాన్ని కోల్పోయినది. ఇంత పెద్ద విస్తీర్ణంలో ఈ చుట్టూ పక్క గ్రామాలలో ఎక్కడ శిఖం (కుంట) భూమి లేదు.అదే సమయములో అక్రమార్కుల కన్ను శిఖం భూమిపై పడి,ఇట్టి భూమిని తమ పేరుపై మార్పు చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డులలో సదరు కుంట శిఖం భూమిని అక్రమార్కులు వారి పేరుతో మొదట శిఖం పట్టాగా తరువాత పట్టాగా మార్పు చేయించుకుని, తరువాత సదరు కుంట భూమి మొత్తం తమదని, అందులో ఇతర వ్యవసాయదారుల పశువులు, బర్రెలు, గొర్రెలు మేయుటకు, నీరు తాగుటను కూడా అడ్డుకున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై అర్ధ, అంగ బలాలు ఉపయోగించి బయపెట్టినారు. ఆతర్వాత ఈయొక్క ధనకుంట నీరు నిలువ లేకుండా పూర్తి స్థాయి నీటి మట్టం చేరకుండా కుంట దక్షిణ భాగం చివరలో గండి పెట్టి నీరు వెళ్లిపోయే విధంగా చేసి ఇట్టి సర్వే నంబరు 14లో ఎత్తున వున్న భూమిని సాగుబడిలోకి తెచ్చుకున్నారు. సుమారు గత 50-60సంవత్సారాలుగా కుంట నీరు సదరు గండి పెట్టిన ప్రాంతము నుండే పోతున్న కారణముగా ప్రస్తుత తరాలకు అదే అలుగుగా తెలుసు, అసలైన అలుగు, బర్రె దూడల బొంద ప్రస్తుత తరానికి ఎవరికి తెలియకపోవడం గమనార్హం. ఆశ్చర్యకరంగా ప్రస్తుతము వున్న అలుగు కాలువ తూము కంటే తక్కువ ఎత్తులో ఉండడం గమనించవచ్చు. ఈ కుంట లో నీటిని నిలువ చేయుటకు అవకాశము లేకపోవడముతో భూగర్భ జలం అడుగంటిపోయి సాగు నీరు లేక, ప్రక్కనే డిండి ప్రాజెక్టు ఉన్నప్పటికీ భూగర్భజల అభివృద్ది లేక దశాబ్దాలుగా గుండ్లపల్లి (డిండి) గ్రామ రైతాంగం సాగును వదిలివేయడం గమనించవచ్చు. 2014-15 సంవత్సరము నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ద్వారా పూడికతీత పనులు కూడా ధనకుంటలో జరగకుండా సదరు వ్యక్తులలో ఒకరు స్థానికంగా గత 20ఏళ్లుగా ప్రముఖ పత్రికలకు రిపోర్టర్ గా పని చేస్తూ ఉండటముతో తమ అర్ధ అంగ బలాలను ఉపయోగించి అడ్డుకున్నారు. గ్రామస్తులు ఎవరైనా ఈ విషయముపై మాట్లాడితే వారిని భయపెట్టి కుంట యొక్క అభివృద్ది పనులు జరగకుండా, నీరు నిలువ లేకుండా చేసి తమ స్వార్ధానికి ధనకుంటను నాశనం చేశారు.
1940-50 మధ్య కాలములో రూపొందించిన గ్రామ పటం(నక్ష)లో సర్వే నం. 14ను కుంటగా, స్పష్టంగా పేర్కొని వున్నారు. కానీ అంత కంటే ముందు ఉన్న పాత గ్రామ నక్ష(సుమారు 1850 సంవత్సరములో రూపొందించినది)ను అనుసరించి కూడా సర్వే నం. 35(మాజీ) కూడా సదరు ప్రాంతం ధనకుంట (శిఖం భూమి)గానే పేర్కొని వుండడము ధనకుంట యొక్క చరిత్రను తెలుపుచున్నది. ప్రస్తుత డిండి ప్రాజెక్టు నిర్మాణము కంటే 2-3 శతాబ్దాలకు ముందే ఈ యొక్క ధన కుంట నీరు నిలువ చేయుటకు, పంట పొలాలకు సాగు నీరు అందించుటకు నిర్మించబడినది అని పైన పేర్కొన్న విషయాల ద్వారా ధృవీకరించబడుచున్నది. గ్రామ నక్ష ప్రకారం కుంటగా పేర్కొనబడిన భూమి శిఖం భూమి నుండి పట్టా భూమిగా మార్పు ఎలా చేయగలిగారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సుమారు 500 ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు, త్రాగు నీరు అందిస్తూ, భూగర్బ జలాలను పెంపొందించడానికి, చేప పిల్లల పెంపకానికి సైతం అవకాశం వుండి కూడా కేవలము ఈ కుంటపై అధికారులకు అవగాహన లేకపోవటము. నిర్వహణ లోపము మరియు కొందరు అక్రమార్కుల స్వార్ధము, దౌర్జన్యము కారణంగా ధనకుంట తన ఆనవాళ్లు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. 1986-1987వ దశకము వరకు గ్రామ రెవెన్యూ రికార్డులలో సదరు ధనకుంట భూమిని శిఖము భూమిగా పేర్కొన్నప్పటికి అక్రమార్కులు తమకున్న పలుకుబడిని ఉపయోగించి రికార్డులలో శిఖము అన్న పదము తొలగించి పట్టా భూమిగా మార్పు చేయించుకుని పట్టాదారు పాసు పుస్తకము,టైటిల్ డీడ్ లు పొంది బ్యాంక్ ల నుండి వ్యవసాయ, తనఖా ఋణాలు, కరువు-ప్రకృతి విపత్తుల సమయములో ప్రభుత్వము అందించే సహాయముతో పాటు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పెట్టుబడి సహాయాలను, రైతుబంధు డబ్బులు సైతం పొందినారు, ఇప్పటికీ పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా అటు వ్యవసాయ శాఖ గత 7 ఏళ్లుగా రైతు బంధు డబ్బులు వేయటం, బ్యాంక్ లు పంట రుణాలు అందించటం గమనార్హం.ప్రస్తుతము సదరు వ్యక్తులు ఇకపై ఈ యొక్క ధన కుంటలో ఎటువంటి నీరు నిలువ వుండకుండా వుండేందుకు జే.సి.బి. ఉపయోగించి ఒక వైపు నుండి కాలువలాగా చేసి ఎప్పుడూ వచ్చిన నీరు అప్పుడు వెళ్లిపోయే విధంగా ఏర్పాటు చేసి శిఖం భూమి 25.19 ఎకరములను పూర్తిగా తమ ఆదీనములోనికి తెచ్చుకొని కుంట లోపలి భాగము మొత్తము మట్టితో నింపి వందల ఏళ్ల క్రితం నిర్మించిన కట్టకు సమాంతరంగా చదును చేసి వెంచర్ గా మార్చి ప్లాట్లుగా మార్చుటకు ప్రయత్నిస్తున్నారు. అటు వ్యవసాయ శాఖ, రెవెన్యూ మరియు నీటిపారుదల శాఖలు ఇంత జరుగుతున్నా అటు వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. ఆ లోగుట్టు పెరుమాళ్ళుకే ఎరుక!గుండ్లపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని సర్వే నం. 14లో గల 25.19 ఎకరముల శిఖం (ధన కుంట) భూమిని గ్రామ నక్ష మరియు భూ-రికార్డులను పరిశీలించి, సర్వే చేయించి సదరు సర్వే నంబరు 14ను రికార్డులలో తిరిగి శిఖం భూమిగా మార్పు చేసి,అభివృద్ది పనులు నిర్వహించి సదరు భూమిపై నుండి అక్రమార్కులను ఖాళీ చేయించి పూడికతీత మరియు ఇతర అభివృద్ది పనులు నిర్వహించి సుమారు 500 ఎకరాలకు ప్రత్యక్షంగా,పరోక్షంగా సాగు నీరు అందించగలిగి,గ్రామంలో కూడా భూగర్భ జల అభివృద్ది జరిగే అవకాశం ఉండి, పెద్ద ఎత్తున చేపల పెంపకానికి అవకాశము వున్న ధన కుంటను పరిరక్షించి సుమారు 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తే స్థానికంగా అత్యధిక జనాభా కలిగిన రైతులకు, ముదిరాజులకు ఎంతగానో ఉపయోగపడడంతో పాటు గ్రామములో కూడా భూగర్భజలము పుష్కలంగా పెరిగే అవకాశము లేకపోలేదు అంటున్న గ్రామ ప్రజలు.