మాగనూర్ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారించింది. సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ భోజనం వికటిస్తుందని తెలిపారు. వారం వ్యవధిలో భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యనించింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని ప్రశ్నించింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శమని పేర్కొంది.