- త్వరలోనే చేనేత రుణమాఫీ
- మార్చి నాటికి లక్ష ఎకరాల్లో పామాయిల్ ప్లాంటేషన్
- వెల్లడించిన మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ అమలు చేసినట్లు చెప్పారు. మొత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల రైతుల అకౌంట్లలో రూ.22 వేల కోట్ల నగదు జమ చేసినట్లు చెప్పారు. తాజాగా…తెలంగాణాలోని నేతన్నలకు సైతం మంత్రి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి రూ.238 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. అన్నదాతల మాదిరిగానే చేనేత కార్మికులకు రుణమాఫీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామన్నారు.
ఆర్థిక శాఖ నుంచి ఆమోదం రాగానే చేనేత రుణమాఫీ అమలుచేస్తామన్నారు. చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ అవసరాల కోసం చేనేత వస్త్రాలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలి. ప్రైవేటుసంస్థల వద్ద కొనుగోలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలోని కార్మికుల సంక్షేమం కోసం బతుకమ్మ చీరలు, ఇతర పథకం కింద రూ.428 కోట్లు విడుదల చేశాం.
నేతన్నకు చేయూత పథకం కింద మరో రూ.290.09 కోట్ల బకాయిలు విడుదల చేశాం. మరమగ్గాల పథకం కింద చేనేతలను ఆదుకునేంద్ను రూ.5.45 కోట్లు, 10 శాతం నూలు సబ్సిడీ కింద మరో రూ.37.49 కోట్లు, పావలావడ్డీ కింద రూ.1.09 కోట్లు చేనేతల సంక్షేమానికి విడుదల చేశాం.’ అని మంత్రి తుమ్మల వెల్లడించారు.
చేనేత కార్మికుల ఉపాధి కోసం..ప్రతి ఏడాది 64.70 లక్షల మంది స్వయంసహాయక సంఘాల మహిళలకు రెండు చొప్పున ఏకరూప చీరల పంపిణీ పథకాన్ని చేపట్టనున్నట్లు చెప్పారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ కి త్వరలోనే శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేసారు. చేనేతలను ఆదుకుంటామని..వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తుమ్మల వెల్లడించారు.