Friday, January 31, 2025
spot_img

భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిట

Must Read
  • వైభవంగా నాగోబా జాతర
  • ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర

ఆదివాసీల ఆరాధ్య దైవం, మెస్రం వంశీయుల కులదైవమైన కేస్లాపూర్‌ నాగోబా(Nagoba Jatara) భక్తుల పూజలు అందుకొనున్నాడు. వారం రోజులపాటు భక్తుల రాకతో కేస్లాపూర్‌ కిటకిటలాడనుంది. పుష్య అమావాస్య రోజున అర్ధరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబా అభిషేకం తర్వాత మహాపూజ ప్రారంభించి నాగోబా జాతర ప్రారంభం కానుంది. అందుకోసం మెస్రం వంశీయులు ఈనెల 10వ తేదీన కేస్లాపూర్‌ నుంచి గంగాజల పాదయాత్ర చేపట్టి వందల మైళ్ళు కాలినడకన గోదావరిలోని హస్తలమడుగు వద్దకు చేరుకుంది. పవిత్ర గంగాజలాన్ని సేకరించి తిరుగు ప్రయాణంలో ముందస్తుగా చేపట్టిన ఆచార సాంప్రదాయాల్లో మొదటి ప్రధాన ఘట్టాన్ని పూర్తిచేసుకుని ఇంద్రవెల్లిలో ఇంద్రాదేవికి మహాపూజ నిర్వహించారు. ఆపై కాలినడకన పవిత్ర గంగాజలంతో మెస్రం వంశ పెద్దలు వారి వెంట మేస్రం వంశ కుటుంబాలు ఎడ్లబండ్లతో కుటుంబ సమేతంగా కేస్లాపూర్‌ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకున్నారు. శనివారం నుంచి రెండు రోజులపాటు మర్రిచెట్ల వద్దనే బస చేసి సాంప్రదాయ ఆచార కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఈనెల 28వ తేదీ నాడు కేస్లాపూర్‌ లోని నాగోబా ఆలయ ప్రాంగణంలోని గోవాడ వద్దకు చేరుకుని, గంగాజలంతో నాగోబా ఆలయానికి మెస్రం వంశీయులు చేరుకుంటారు. ఆలయ శుద్ధి తర్వాత అర్థరాత్రి నాగోబాకు పవిత్ర గంగాజలంతో అభిషేకం నిర్వహించి మహాపూజ ప్రారంభించనున్నారు. అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది. నాగోబా జాతర ఏర్పాట్లపై ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజార్షి షా, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం, ఎండోమెంట్‌ అధికారులు,ఇతర జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై అధికారులు పనులు పూర్తి చేయాలని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ముందుగా నాగోబా జాతరకు సంబంధించిన పరిసర ప్రాంతాలలో ఏర్పాట్లను పరిశీలించారు. మర్రిచెట్టు ప్రాంతం, కోనేరు, గోవాడ్‌, తై బజార్‌, స్టాల్స్‌, దేవాలయ ప్రాంతం, తదితర ప్రాంతాలలో చేపడుతున్న పనులను పరిశీలించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లు, చేపట్టవలసిన పనుల వివరాలను వివిధ శాఖల వారీగా అడిగి తెలుసుకున్నారు.

త్వరగా ఏర్పాట్లు పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్‌ రాజార్షి షా
ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా మాట్లాడుతూ.. ఆయా ముఖ్యమైన శాఖలకు సంబంధించిన విధులను షిఫ్ట్‌ ల వారిగా కేటాయించడం జరిగిందనీ, వారం రోజుల పాటు జరిగే నాగోబా జాతరలో సంబంధిత అధికారులు విధులు నిర్వహించడం జరుగుతుందనీ అన్నారు. ముఖ్యమైన కూడళ్లలో ప్లెక్సీలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్‌ రూమ్‌ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భక్తులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలని, ప్రశాంతంగా దైవదర్శనం చేసుకొని, తిరుగు ప్రయాణం చేసేంతవరకు ఆన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. జాతరకు పొరుగున ఉన్న మహారాష్ట్రతో సహా సుదూర ప్రాంతాల నుండి ఉన్నతాధికారులు, ఆదివాసీ మెస్రం వంశీయులు, తదితర భక్తులు ఈ జాతరకు తరలివస్తారని అన్నారు. సమీక్షలలో అనంతరం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద మహ జాతర నాగోబా జాతర అని, ఈ జాతరను అందరి సమన్వయంతో విజయవంతం చేయాలనీ అన్నారు. ముఖ్యంగా జాతరకు సంబంధించి ప్రతి బస్‌ కు నాగోబా జాతర నిర్వహించు స్టిక్కర్లను అతికించాలని, నాగోబా జాతర అన్ని జిల్లాలకు తెలిసేలా అన్ని బస్టాండ్‌ లలో, బస్‌లకు స్టిక్కర్లు వేయాలని తెలిపారు. ముఖ్యంగా జాతర లో హోటల్స్‌, తినుబండారాలు, తదితర వ్యాపారులు కొనుగోలు చేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా ఆహారం కలుషితం కాకుండా, నిలువ ఉంచకుండా ఎప్పటికప్పుడు ఏరోజుకారోజు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని ఆహారాభద్రతా కమిటి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా ఎస్పీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ.. నాగోబా జాతరకు సంబంధించి అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందని, బారికేడ్లు, పోలీస్‌ బందోబస్తు, పోలీస్‌ క్యాంప్‌ ను ప్రతి ఏడాది లాగే ఏర్పాటు చేయడం జరుగుతుందని, జాతరకు వచ్చే భక్తులకు ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడకుండా అన్నిచోట్ల ప్రత్యేక పోలీసు బందోబస్తును తదితర ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ.. వారం రోజుల పాటు జరిగే జాతరలో భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని, ఈ నెల 28న రాత్రి మహాపూజ, 31న ప్రజా దర్బార్‌ నిర్వహించడం జరుగుతుందనీ, అధికారులు అన్ని చర్యలు చేపట్టి విజయవంతం చేయాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఉట్నూర్‌ సబ్‌ కలెక్టర్‌ యువరాజ్‌ మార్మట్‌, ట్రైనీ కలెక్టర్‌ అభిగ్యాన్‌, ఆలయ కమిటి సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎస్ఎల్ఎన్ ఫ్రీ లాంచింగ్ మోసాలు

అనుమతులు నిల్.. పబ్లిసిటీ ఫుల్ మేడ్చల్ దగ్గరలో కొత్తరకం భూదందా ఫ్రీ లాంచింగ్ పేరుతో భారీ మోసాలు గుంట భూమి.. గుండెకు ధైర్యం తల్లి జన్మనిస్తుంది భూమి పునర్జన్మణిస్తుంది సరికొత్త కొటేషన్లతో బురిడీ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS