సిరియాలో బషర్ అల్-అసద్ నేతృత్వంలోని తిరుగుబాటు దారులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ దళాల్ని వెనక్కినెడుతూ కీలక పట్టణాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే వీరు అనేక కీలక పట్టణాలను తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో సిరియాలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత విదేశాంగశాఖ అలర్ట్ అయింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేసింది.
భారత పౌరులు తక్షణమే ఆ దేశాన్ని వీడాలని తెలిపింది. తదుపరి నోటిఫికేషన్ జారీ చేసేవరకు ఆ దేశానికి వెళ్లొద్దని సూచించింది. అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా సిరియాను వీడాలని తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో డమస్కస్లోని ఇండియన్ ఎంబసీతో సంప్రదరింపులు జరపాలని సూచించింది. సిరియాలో ప్రయాణించేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారత కేంద్ర విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.