మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు.. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. నిందితులకు శిక్ష పడి 18 ఏళ్లుగా కడప సెంట్రల్ జైలులో ఉన్నారు. నిందితులు హైకోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణ అనంతరం హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల రెండు పూచీకత్తులు ఇవ్వాలని, జైలు నుంచి విడుదలయ్యాక సత్ప్రవర్తన సరిగా లేకపోతే వచ్చే ఫిర్యాదు మేరకు బెయిల్ రద్దు చేస్తామని కోర్టు హెచ్చరించింది. పరిటాల రవి 2005 జనవరి 24వ తేదీన ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తుండగా అతడిపై దాడిచేసి చంపివేశారు.