- డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
- 2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం గరం..
- రెండు సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్ రాత్రికి రాత్రే డంప్ చేస్తున్న మిల్లర్లు!
- సూర్యాపేట జిల్లా, తిరుమలగిరిలోని ఎ.ఎస్.ఆర్ రైస్ ఇండస్ట్రీ జిమ్మిక్కులు..
- 2021-22 సీజన్ కు చెందిన 2 కోట్ల విలువైన 583 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 24 గంటల్లో అప్పగించిన వైనం!
- ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని సతాయించిన మిల్లర్ ఒక్కరోజులోనే సీఎంఆర్ ను ఎలా డంప్ చేశారు?
- సీఎంఆర్ ధాన్యం దందాలో అంత మజా ఉన్నదా?
తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ సీఎంఆర్ బియ్యం సేకరణలో మిల్లర్ల వైఖరి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. 2021-22 రబీ, ఖరీఫ్ సీజన్లో ప్రభుత్వం నుండి దాన్యం తీసుకొని, బియ్యం అప్పగించని రైస్ మిల్లులను డిఫాల్ట్ జాబితాలో చేర్చింది. అంతేకాకుండా సీఎంఆర్ పాలసీలో భాగంగా సంబంధిత డీఫాల్ట్ మిల్లర్ల నుండి 25 శాతం పెనాల్టీతో కలిపి సదరు మిల్లర్ సిఎంఆర్ ను ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా రాష్ట్ర సివిల్ సప్లయ్ కమిషనర్ ఎస్.బి.చౌహాన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రెండేళ్లుగా రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ కు బియ్యం ఇవ్వకుండా సతాయించిన ఈ యొక్క డిఫాల్ట్ మిల్లర్లందరికీ ప్రస్తుత రబీ సీజన్లో ఎక్కడ కూడా ధాన్యం కేటాయింపులు చేయరాదని సివిల్ సప్లయ్ శాఖ నిర్ణయం తీసుకుంది.
డిఫాల్ట్ జాబితాలో ఉన్న మిల్లర్ తనకు సంబంధించిన పాత బకాయిలు 25 శాతం పెనాల్టీతో కలుపుకొని సీఎంఆర్ ప్రభుత్వానికి అప్పగించినా సరే, వారికి ప్రస్తుతం ధాన్యం కేటాయించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ కలెక్టర్లకు సూచన చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సంబంధిత డీఫాల్ట్ మిల్లర్లు పెండెన్సీ క్లియర్ చేసినా వారికి ధాన్యం కేటాయింపుల విషయం ఆయా జిల్లా కలెక్టర్ల విచక్షణాధికారంపైనే ఆధారపడి ఉంటుందని సంబంధిత ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నట్లు సమాచారం.
ఒక్కరోజులోనే 2 కోట్ల విలువైన 583 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డంప్ చేసిన మిల్లర్..!
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్లకు చెందిన సిఎంఆర్ ఇవ్వడంలేదని సూర్యాపేట జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు సుమారు 15 మంది రైస్ మిల్లర్లను డిఫాల్ట్ జాబితాలో చేర్చారు. గడిచిన మార్చి 21న వీరందరికీ జిల్లా అధికారులు ఓ మెమోను కూడా జారీ చేశారు (సంబంధిత లేఖ నెం. సి.ఎస్.7/96/2024, తేదీ 21-03-2024). ఈ డిఫాల్ట్ జాబితాలో తిరుమలగిరి మండలానికి చెందిన ఎ.ఎస్.ఆర్ రైస్ ఇండస్ట్రీ సీరియల్ నెంబర్ 32. వీలైనంత త్వరలో సంబంధిత సీఎంఆర్ బియ్యాన్ని మిల్లర్లు వెంటనే అప్పగించాలని అధికారులు అల్టిమేటం ఇచ్చారు. కానీ కొందరు మిల్లర్లు ఈ మెమోను బేఖాతర్ చేశారు. కమిషనర్ నుండి ఆదేశాలు కఠినంగా రావడం, డిఫాల్ట్ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయించరాదని తెలియగానే కొంతమంది మిల్లర్లు ఆగమేఘాల మీద రాత్రికి రాత్రే పాత బకాయిలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అనేక జిమ్మిక్కులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగానే తిరుమలగిరి మండల కేంద్రంలో ఉన్న ఏ.ఎస్.ఆర్ రైస్ మిల్లర్ రాత్రికి రాత్రే 2 కోట్ల విలువైన 583.467 మెట్రిక్ టన్నుల పెండిరగ్ బియ్యాన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది. 2021-22 సీజన్ అంటే సుమారు రెండు సంవత్సరాల కాలం కావస్తోంది. రెండేళ్ల నుండి ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టిన సదరు రైస్ మిల్లర్ ఒకేరోజు ఇంత మొత్తంలో బియ్యాన్ని ఎలా ఇవ్వగలిగారని పలువురు మిల్లర్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుత రబీ సీజన్లో ఎలాగైనా తన మిల్లుకు ప్రభుత్వ నుండి ధాన్యం దిగుమతి చేయించుకోవాలనే స్వార్థపూరిత ఆలోచనతో రాత్రికి రాత్రే రెండేళ్ల క్రితం నుండి పెండెన్సీలో ఉన్న సీఎంఆర్ ను ప్రభుత్వానికి అప్పగించినట్లు వినికిడి.
సీ.ఎం.ఆర్ పాలసీలో మిల్లర్లకు ఇంత మజా ఉందా.?
దీన్నిబట్టి పరిశీలిస్తే, సీఎంఆర్ బియ్యం పాలసీలో మిల్లర్లకు ఎంత లాభం లేకుంటే.. రెండేళ్ల నుండి తన వద్ద మిగిలిపోయిన సీఎంఆర్ బకాయిని ఒకేరోజులో ఇంత పెద్ద మొత్తంలో ఎలా దిగుమతి చేయగలిగారు? ఒకవేళ తన వద్ద సంబంధిత బియ్యమే సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అప్పగించకుండా ఎందుకు ఇన్నేండ్లు తాత్సారం చేసినట్లు! అసలు ఇలాంటి వాళ్ళు అప్పగిస్తున్న సీఎంఆర్ బియ్యం పి.డి.ఎస్ రీసైక్లింగ్ బియ్యం కాదని చెప్పే నైపుణ్యత, టెక్నాలజీ జిల్లా సివిల్ సప్లయ్ అధికారుల వద్ద ఉన్నదా? అనే ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి. ఎలాగైనా తమ మిల్లులకు ధాన్యం కేటాయించుకోవాలనే ఇలాంటి మిల్లర్ల స్వార్థపూరిత ఆలోచనల వలన ప్రభుత్వం బదనాం కాక తప్పదు.
కలెక్టర్ గారు.. జర అప్రమత్తంగా ఉండండి సార్..!
సూర్యాపేట జిల్లాలో కొంతమంది మిల్లర్లు సృష్టిస్తున్న సర్కస్ జిమ్మిక్కుల పట్ల జిల్లా కలెక్టర్, సివిల్ సప్లయ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఇన్నాళ్లు ప్రభుత్వాన్ని సతాయించి సడన్ గా రాత్రికి రాత్రే సిఎంఆర్ డంప్ చేస్తున్న సంబంధిత బియ్యాన్ని శాస్త్రీయంగా తనిఖీ చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 2019 నుండి 2022 వరకు తిరుమలగిరిలో ఎ.ఎస్.ఆర్ రైస్ మిల్లర్ చేసిన ధాన్యం నకిలీ ట్రక్ షీట్ల దందా సుమారు 10 కోట్లు..! త్వరలో… మీ ఆదాబ్‌లో..