Saturday, August 2, 2025
spot_img

నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల దందా

Must Read
  • కోర్టు కెవియట్‌ పిటిషన్‌ను పట్టించుకోని తహశీల్దారు!
  • కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులు కూడా విలువ లేని కాగితాలా?
  • కోర్టులంటే గౌరవం లేదు, పైఅధికారులనే భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు..
  • వృద్ధ మహిళ మొర వింటే మానవత్వమే కదా?

ప్రజల హక్కుల పరిరక్షణకు అడ్డుగా నిలుస్తున్న నల్లగొండ తహశీల్దారు కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. కోర్టులో కెవిట్ పిటిషన్ వేసి, భూ విషయంలో రిజిస్ట్రేషన్ జరగకూడదని వృద్ధ మహిళ వేసిన విజ్ఞప్తిని అధికారులెవ్వరూ పరిగణనలోకి తీసుకోకపోవడమే కాదు, కోర్టు ఆదేశాలనూ తృణప్రాయంగా పరిగణించి రిజిస్ట్రేషన్ జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ ఉత్తర్వులను చెత్తలో వేసినట్లుగా ఉంది ఇక్కడి అధికారుల వైఖరి. కోర్టులంటే గౌరవం లేదు, పై అధికారులన్న భయం లేదు, ప్రజల విజ్ఞప్తులకు విలువలేదు, మరి వీళ్ళు ఎవరి మాట వింటారు అనేది ఇక్కడ ప్రశ్న! డబ్బులిస్తే చాలు, ప్రభుత్వ భూములకు సైతం పట్టాలు ఇచ్చే ఘనులున్న కార్యాలయం ఇది. గడిచిన 19వ తేదీన అన్నెపర్తి గ్రామానికి చెందిన ప్రయివేటు భూమి సర్వే నెంబర్ 430/ఆ, 430/ఆ/1/1 చెందిన రిజిస్ట్రేషన్ విషయంలో నల్లగొండ తహశీల్దారు కార్యాలయం అధికారులు ఆడిన వింత నాటకం ఇది.

వృద్ధ మహిళ మొరను నిర్లక్ష్యంగా త్రోసిపారేశారు..
సంవత్సరాలుగా తమ భూమిని కాపాడుకుంటున్న వృద్ధ మహిళ తాను కోర్టులో పిటిషన్ వేసిన విషయాన్ని తహశీల్దార్ కార్యాలయానికి, రెవెన్యూ అధికారులకు విన్నవించినప్పటికీ స్పందించలేదు. బతుకుదెరువు కోసం ఫిర్యాదులతో తిరుగుతున్న ఆమె మొరను కనీసం వినడానికైనా ఎవరూ ముందుకురాలేదంటే అధికారుల అమానవీయ దృక్పథం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. తన భర్త అయిన అంతటి చిన్న లింగయ్య తనకు పిల్లలు పుట్టలేదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని, వారికి ఒక కుమారుడు కలిగాడని, అప్పటి నుండి తనను అన్నెపర్తిలోనే వదిలేశాడని మొదటి భార్య అంతటి లింగమ్మ పేర్కొంది. భర్త లింగయ్య గతంలోనే ఇక్కడ కొంత భూమిని అమ్ముకున్నాడని, అన్నెపర్తిలో తన భర్త పేరున మిగిలి ఉన్న ఆ భూమిని తనకు వదిలి వెళ్లాడని తెలిపింది. గడిచిన 35 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ, ఒంటరిగా బంధువుల చెంత బ్రతుకుతున్నానని, ఇప్పుడు తన వద్దనున్న 4.5 ఎకరాలు భూమి ఆయనే పేరునే ఉన్నందున తనను పక్కకు నెట్టి, ఇతరులకు అమ్ముకోబోతున్నాడని, కనీసం నా బ్రతుకు దెరువు, జీవనం కోసం అయినా అందులో ఒక అర ఎకరం భూమిని తనకు ఇవ్వమని తన భర్తను ప్రాధేయపడినా, భార్య అనే కనికరం చూపడం లేదని, ఈ విషయంలో తనకు న్యాయం చేయమని అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్, ఆర్.డి.ఓ లకు మొరపెట్టుకుంది. గ్రామస్థుల సలహా మేరకు అంతటితో ఆగకుండా జిల్లా కోర్టులో కెవియట్ పిటిషన్ కూడా ముందస్తుగానే వేసింది(పిటిషన్ నెం.119 ఆఫ్ 2025).

భాధితురాలు అంతటి లింగమ్మ

కలెక్టర్, ఆర్డీఓ ఉత్తర్వులను కాగితపు చెత్తలా పరిగణించిన తహశీల్దారు..
జూన్ మొదటి వారంలో అంతటి లింగమ్మ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ ఆదేశానుసారం నల్లగొండ ఆర్డీఓ జూలై 1న స్థానిక తహశీల్దారుకు ఈ విషయంలో పూర్తి విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు (సదరు ఆర్డీఓ లేఖ.నెం.పివి-బి/450/2025, తేదీ.01-07-2025). ఈ లేఖను తహశీల్దారు జూలై 4 న రిసీవ్ చేసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వృద్ధ మహిళా అయిన అంతటి లింగమ్మ (70) తనకు అన్యాయం చేయొద్దని, నేరుగా నల్లగొండ తహశీల్దారును కూడా కలిసి వేడుకుంది. అయినా తహశీల్దారు ఇవేవి లెక్క చేయకుండా, జూలై 18 న సదరు భూమి స్లాట్ బుక్కయితే, మరుసటి రోజు జూలై 19న రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. జూలై 18 న విషయం తెల్సుకున్న లింగమ్మ తహశీల్దారు కార్యాలయ అధికారుల కాళ్ళ వేళ్ళ పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నా, కసాయి అధికారులు కనీసం కనికరం చూపకపోగా, సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 ను కూడా పట్టించుకోలేదు. ఇదే భూమి సర్వే నెంబర్ 430/ఆ, 430/ఆ/1/1 పై కోర్టులో కేవియట్ ఉన్నదని తెలిసి, కలెక్టర్ ఆదేశాలను తుంగలో తొక్కి, ఇక్కడి అధికారులు ఇష్టారీతిగా ప్రవర్తించడం శోచనీయం.

పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా కలెక్టర్, ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను కూడా తహశీల్దారు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి, స్పష్టంగా కనిపిస్తున్నాయి. తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు ఇరువురు బరితెగించి, పాలనకు తలకిందులుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

తక్షణ విచారణకు జిల్లా కలెక్టర్ జోక్యం అవసరం!
ప్రజల హక్కులను విస్మరించి, నిబంధనలను తొక్కేస్తున్న అధికారుల వ్యవహార శైలిపై ప్రభుత్వమే స్పందించాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వివరణ:
తమకు కలెక్టర్ గ్రీవెన్సు నుండి రోజుకు 20 పైగా దరఖాస్తులు వస్తూనే ఉంటాయి. పని వత్తిడిలో కొన్ని మర్చి పోతుంటాము. అంతటి లింగమ్మ భూమి విషయంలో కోర్టు కేవియట్ అధికారికంగా మాకు అందలేదు. ఆర్డీఓ ఆదేశాలు వచ్చి ఉంటాయి, కానీ గుర్తుకు లేదు. ఇవ్వన్నీ ఆధారాలు మీకు ఒక రోజు ముందే లింగమ్మ బంధువులు అందచేశారని వారు పేర్కొన్నారు కదా! అని ‘ఆదాబ్’ అడుగగా, లింగమ్మ, లింగయ్య వాళ్ళు ఎప్పుడో విడిపోయారని, అన్నిటిని చూసే రిజిస్ట్రేషన్ చేశామని తహశీల్దారు తెలిపారు.

  • పరుశరామ్, నల్లగొండ తహశీల్దారు
Latest News

వైశ్య వ్యాపార వేత్తల ఐక్యతకు కొత్త వేదిక – జీవీబీఎల్ ఘనంగా లోగో, వెబ్‌సైట్ ఆవిష్కరణ… ఏడు నూతన చాప్టర్ల ప్రకటన

వైశ్య వ్యాపార వేత్తల కోసం వ్యాపార నెట్‌వర్కింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ ‘గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్’ (జీవీబీఎల్) సంస్థ శనివారం హైదరాబాద్‌లోని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS