Sunday, July 27, 2025
spot_img

హెచ్‌సీఏలో అవినీతి

Must Read
  • ముసుగులు తెరలేపిన సీబీఐ, సీఐడీ దర్యాప్తులు
  • హెచ్ సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు నియామ‌కం
  • జనరల్ సెక్రెటరీ దేవరాజ్ అరెస్ట్.. 17 రోజుల్లో 7 రాష్ట్రాలు తిరిగిన దేవరాజు
  • సీఐడి దర్యాప్తులో బయటపడుతున్న అక్రమాలు.. కీలక ఆధారాలు సేకరణ‌

తెలంగాణ క్రికెట్ లో జరిగే ఆటల కన్నా, హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ లో జరిగే అక్రమాలే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. పదే పదే వాదనలు, కేసులు, అరెస్టులు… ఇలా హెచ్‌సీఏ చుట్టూ వివాదాల కుదుపు కొనసాగుతూనే ఉంది. తెలంగాణ హైకోర్టు హెచ్‌సీఏ వ్యవహారాల పర్యవేక్షణ కోసం రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావును నియమించింది. హెచ్‌సీఏలో ఏ నిర్ణయాన్ని కూడా నవీన్ రావు అనుమతి లేకుండా తీసుకోవద్దని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ తరఫున వేసిన పిటిషన్‌లో, హెచ్‌సీఏలో 2007 నుంచి జరిగిన అవకతవకలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న విజ్ఞప్తిని హైకోర్టు పరిశీలిస్తోంది. తాజాగా జులై 19న జరిగిన 87వ ఏజీఎం తీరుపై సఫిల్‌గూడ క్లబ్ అభ్యంతరం తెలిపింది. 10 రోజుల నోటీసు ఇవ్వకుండా ఏజీఎం నిర్వహించారని పేర్కొంటూ, సీబీఐ, బిసిసిఐ, హెచ్‌సీఏలను ప్రతివాదులుగా చేర్చి కేసు వేశారు. ఈ కేసుపై సోమవారం పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

సీఐడి చేతిలోకి దేవరాజ్ – 17 రోజులు, 7 రాష్ట్రాల చుట్టూ పరార్‌ స్టోరీ
హెచ్‌సీఏ జనరల్ సెక్రటరీ దేవరాజ్ పై కేసు నమోదైన 17 రోజులకు పోలీసులు ఆయనను పూణెలో అరెస్ట్ చేశారు. ఆరెస్టు నుంచి తప్పించుకునేందుకు దేవరాజ్ హైదరాబాద్, భద్రాచలం, వైజాగ్, తిరుపతి, చెన్నై, గోవా, బెంగళూరు, పూణే, ఊటీ లాంటి 7 రాష్ట్రాల 13 నగరాల చుట్టూ తిరిగినట్లు సీఐడీ తెలిపింది. దేవరాజ్‌ను పట్టుకునేందుకు సీఐడీ ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేసి, 36 గంటల పాటు నిర్విరామంగా ఆపరేషన్ నిర్వహించడంతో చివరికి పూణెలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన తరువాత మల్కాజ్‌గిరి కోర్టులో హాజరు పరిచారు. హెచ్‌సీఏ స్కాంలో దేవరాజ్ ఏ2 నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు.

సమ్మర్ క్యాంపుల పేరుతో 4 కోట్ల దోచుకున్న వ్యవహారం
సీఐడీ దర్యాప్తులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు గ్యాంగ్ పెద్దమొత్తంలో కుంభకోణం చేసినట్లు ఆధారాలు బయటపడ్డాయి. 2023 మే 20 నుంచి 2024 మే 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా 28 కేంద్రాల్లో సమ్మర్ క్యాంపులు నిర్వహించామంటూ తప్పుడు లెక్కలు చూపారని అధికారులు గుర్తించారు. ప్రతి కేంద్రంలో 100 మంది విద్యార్థులకు క్రికెట్ కోచింగ్ ఇచ్చామంటూ లెక్కలు చూపి, ఒక్కో క్యాంప్ పై 15 లక్షలు ఖర్చు అయ్యాయంటూ మొత్తం 4 కోట్ల రూపాయలు హెచ్‌సీఏ ఖజానా నుంచి దారి మళ్లించినట్లు వివరాలు దొరికాయి. అంతేకాదు, విద్యార్థులకు క్రికెట్ కిట్లు ఇచ్చామంటూ కూడా తప్పుడు బిల్లులు చూపారని సీఐడీ విచారణలో తేలింది. సమీక్షించిన కేంద్రాల్లో అసలు ఖర్చు ఒక్కో క్యాంప్ కు లక్ష రూపాయలు కూడా కాకుండా ఉన్నట్లు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. దీంతో ఈ స్కాంలో పాల్గొన్నవారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే ప్రక్రియకు సీఐడీ సిద్ధమవుతోంది.

క్రికెట్ కంటే కుంభకోణమే ముందున్న హెచ్‌సీఏ?
ఇప్పటివరకు హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలు తెలంగాణలో క్రీడా పరిపాలనలో ఉన్న లోపాలను బయటపెడుతున్నాయి. స్థానిక క్రికెట్ అభివృద్ధి కోసం ఉపయోగపడాల్సిన కోట్ల రూపాయలు కొందరి జేబుల్లోకి వెళ్ళిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిపోతుండటంతో, హెచ్‌సీఏలో సిస్టమ్‌ అడ్డగోలు వ్యవస్థను మార్చాల్సిన అవసరం అత్యవసరమైందని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.

ఇక త్వరలో హైకోర్టులో జరిగే పూర్తి విచారణ, సీబీఐ దర్యాప్తు ప్రారంభం, సీఐడీ తుది నివేదికతో హెచ్‌సీఏ లో జరుగుతున్న లావాదేవీలకు అసలు రూపం బయటపడనుంది. నిజానికి తెలంగాణ క్రికెట్‌కు ఇది శుద్ధికాలమని ఆశిద్దాం.

Latest News

టి-హబ్ వేదికగా ఘనంగా ముగిసిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ గ్రాడ్యుయేషన్ కార్యక్రమం

నగరంలోని టి-హబ్‌ వేదికగా 'డిజిప్రెన్యూర్.ఏఐ' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలుగు ఏఐ బూట్‌క్యాంప్ 2.O’ స్నాతకోత్సవం శనివారం ఘనంగా జరిగింది. సాంకేతిక రంగంలో తెలుగువారికి సరికొత్త...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS