- సర్వే నెం.6లో 3ఎకరాల 14గుంటల టెంపుల్ భూమి కబ్జా
- అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు
- అవినీతి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన వానరసేన
- రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఎండోమెంట్ అధికారుల సపోర్ట్..
- అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్
- ఫిర్యాదు చేస్తే.. అక్రమార్కులకు చేరవేస్తున్న అధికారులు
- అవినీతి అధికారులపై చర్యలు తీసుకొని ఎండోమెంట్ కమిషనర్
హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశా న్నంటాయి. ఎండోమెంట్, ప్రభుత్వ, అసైన్డ్ ల్యాండ్ లను అక్రమార్కులు చెరబడుతున్నారు. రాజధాని పరిధిలో కోట్లాది రూపాయల విలువ చేసే భూములు మాయం అవుతున్నాయి. ప్రభుత్వ భూములను కబ్జా అవుతుండడం కామన్ కాగా, ఇక దేవుని భూములు సైతం కాపాడేవారే కరువయ్యారు. ‘అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం’ అన్నట్టు భూములను కొందరు కబ్జా చేస్తున్నారు. పెద్దలు చెప్పినట్టుగా ‘పొట్టోడి నెత్తి పొడుగోడు కొడితే.. పొడుగోని నెత్తి పోశమ్మ కొడుతుందనీ’ ఆ విషయాన్ని మరిచి దేవుడి భూమినే దోచేస్తున్నారు. దేవాలయ భూమిపై కన్నుపడ్డ అక్రమార్కులు దాన్ని కొట్టేశారు. ప్రభుత్వ అధికారుల అండతో కోట్లాది రూపాయల విలువైన భూమిని పొతం పెట్టారు. భూముల ధరలు అమాంతం పెరిగి పోవడంతో తిండి తినడం మానేసి భూములనే తింటున్నారు. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లగొడు తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు పట్టింపు లేకపోవడంతో దేవుడి భూములు మాయం అవుతున్నాయి. అందులో భాగంగానే కదరి చమన్ రోడ్, పంచలింగా బస్తీ, టెంపుల్ విస్తీర్ణం 3 ఎకరాల14 గుంటలు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం సుల్తాన్ బాగ్ గ్రామం సర్వే నెం.6లో 3 ఎకరాల14 గుంటల టెంపుల్ భూమి కబ్జాకు గురైంది. పంచలింగాల టెంపుల్ జాగలో కబ్జాకోరులు అక్రమ నిర్మాణం చేపట్టారు. అక్రమార్కులు అనుమతులు లేకుండానే బహుళ అంతస్తుల నిర్మాణాలు నిర్మిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే ఎండోమెంట్ భూమి కబ్జాకు గురైందని వానరసేన దేవాదాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దేవాదాయ భూమి కబ్జాకు గురైనట్లు వెంటనే దీనిపై చర్య లు తీసుకోవాల్సిందిగా గత ఫిబ్రవరి 15న స్థానిక తహాశీల్దార్ కు, అసిస్టెంట్ సిటి ప్లానర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ 8, సౌత్ జోన్ కు ఎండోమెంట్ అధికారి లేఖ రాశారు. అదేవిధంగా ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేశారు. అట్టి భూమి నిషేధిత జాబితాలో ఉన్న సదరు భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే ఎండోమెంట్ హైదరాబాద్ జిల్లా అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ సురేందర్ మరియు ఇతర అధికారులు అక్రమార్కుల నుండి ముడుపులు తీసుకొని ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వానరసేన ఆరోపిస్తుంది. వానరసేన ఫిర్యాదు చేసేంత వరకు కూడా ఎండోమెంట్ అధికారులు దేవునిమాన్యాన్ని కాపాడడంలో విఫలం అయ్యారనే స్పష్టంగా తెలుస్తుంది. దృష్టికి తీసుకువచ్చిన అనంతరం కూడా నోటీసులు జారీ చేసి, చేతులు దులుపుకున్నారు.. కానీ, చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యారు.. ఎండోమెంట్ అధికారులు 30/87 ఎండోమెంట్ ఆక్ట్ ప్రకారం దేవుని మన్యాన్ని కాపాడి, అక్రమార్కులపై క్రమినల్ కేసులు నమోదు చేయాలి. కానీ, స్వార్థ ప్రయోజాల కోసం అధికారులు అక్రమార్కులతో చేతులు కలిపి వారికి సహకరించడం శోచనీయం. ఈ విషయంపై వానరసేన సభ్యులు అధికారులను నిలదీయగా అట్టి విషయాన్ని వెంటనే అక్రమార్కులకు ఎండోమెంట్ అధికారులు చేరవేస్తుండడం విడ్డూరం.. ఇప్పటికైనా ఈ విషయంపై ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకొని, అలాగే ఏసీబీ అధికారులు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని వానరసేన కోరుతుంది..