- వ్యక్తిగత క్యాటగిరిలో 1172 నామినేషన్స్
- చలన చిత్రాలు, డాక్యుమెంటరి, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 నామినేషన్స్
- ఈ నెల 21 నుండి స్క్రీనింగ్ చేయనున్న జ్యూరీ సభ్యులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డి సి ఛైర్మన్ దిల్ రాజు కోరారు. బుదవారం ఎఫ్‌డిసి సమావేశ మందిరంలో జ్యూరీ ఛైర్మన్ సినీనటి జయసుధ అధ్యక్షతన గద్దర్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం జరిగింది. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఛాలెంజ్‌గా తీసుకుని ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్న ట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎఫ్‌డిసి ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర రంగానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చే విధంగా వ్యవహరించాలని జ్యూరీ సభ్యులను కోరారు. జ్యూరిలో నిష్ణాతులైన వారిని ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. 14 ఏండ్ల తర్వాత ప్రభుత్వం చలన చిత్ర అవార్డ్స్ ను ఇస్తున్నట్లు తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదని చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎస్.హరీష్ మాట్లాడుతూ సినీ నటి జయసుధ ఛైర్మన్‌గా 15 మందితో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరిని ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గద్దర్ అవార్డ్స్ కు అన్ని కేటగిరీ లకు కలిపి 1,248 నామినేషన్లు అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21 వ తేదీ నుండి నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. ఈ గద్దర్ అవార్డలకు గాను వివిధ క్యాటగిరిల ఎంట్రీ లకు గాను వచ్చిన నామినేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియ గురించి సభ్యులు చర్చించారు. ఈ పురస్కారాలకు వ్యక్తిగత క్యాటగిరి లో 1172, ఫీచర్ ఫిలిం, బాలల చిత్రాలు, డెబిట్ చిత్రాలు, డాక్యుమెంటరీ/ లఘుచిత్రాలు, ఫిల్మ్ క్రిటిక్స్, పుస్తకాలు తదితర క్యాటగిరిలలో 76 దరఖాస్తులు వచ్చినట్టు జ్యురి తెలిపింది.