Sunday, April 13, 2025
spot_img

నేలకొరిగిన మహావృక్షం

Must Read
  • గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి
  • హరితహారంకు అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌
  • 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు
  • కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్య
  • రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం

ఓ మహావృక్షం నేలకొరిగింది.. అతని జీవితం మొక్కల నాటడానికి అంకితం చేశారు.. 80ఏళ్ళ వయస్సులోనూ మొక్కలు నాటిన మహానీయుడు.. ఇప్పటి వరకు కోటి మొక్కలు నాటిన పచ్చదనం ప్రియుడు.. పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడు.. 2017లో పద్మశ్రీ అందుకున్న గొప్ప వ్యక్తి.. కేసీఆర్‌ హరితహారంకు అతనే ప్రేరణ అతనే బ్రాండ్‌ అంబాసిడర్‌.. పర్యావరణ ప్రేమికులకు అతని జీవితమే ఓ పాఠం… చివరకు అతని ఇంటి పేరుకు కూడా పర్యావరణ తోడైంది.. అతనే మన వనజీవి రామయ్య.

సామాన్యంగా మనం మన పరిసరాల్లో మొక్కలు కనిపిస్తే వాటిని తొలగించేందుకు అనేక వ్యయప్రయాసాలు పడుతుంటాం. కాని వనజీవి రామయ్య మాత్రం అందకు పూర్తిగా భిన్నం. ఎక్కడైన ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడ మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకుని తన శేషజీవితం గడిపారు. మనం మన జెబుల్లో ఎప్పుడు ఏదో మనకు అవసరమైన వస్తువులను తీసుకుని వెళ్తుంటాము కాని అయన మాత్రం తన జెబులో నిత్యం వివిధ రకాల విత్తనాలను తీసుకెళ్ళేవారు అంటే అయనకు వృక్ష సంపద మీద ఎంత ప్రేమ వుండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి గొప్ప వ్యక్తి నేడు మన మద్యలో లేకుండా పోయ్యారు. పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. శనివారం నాడు తెల్లవారు జామున ఖమ్మంలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనజీవి అసలు పేరు దరిపల్లి రామయ్య. అతను ఖమ్మం రూరల్‌ మండలం రెడ్డిపల్లిలో 01-07-1937లో జన్మించారు. విస్తృతంగా మొక్కలను నాటడం, వాటిని సంరక్షించడం, విత్తనాలు- మొక్కలను పంచడం వల్ల వనజీవి రామయ్యగా గుర్తింపు పొందారు.

విద్యార్థి దశ నుంచే పర్యావరణం, మొక్కల పెంపకం పట్ల అయనకు ఆసక్తి వుండేది దీంతో జీవితాంతం కూడా దాన్ని అయన కొనసాగిస్తూ వచ్చారు. చివరకు 80 సంవత్సరాల వయస్సులోనూ అయన విసృతంగా మొక్కలను నాటారంటే ఆయనకు పర్యావరణం పై ఎంతగా అసక్తి వుండేదో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారు కోటికిపైగా మొక్కలను నాటిన అయన సామాజిక అడవుల పెంపకం, అటవీ సంరక్షణ ప్రచారకర్తగా కూడా వ్యవహరించారు. పర్యావరణ రంగంలో ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ తొలిసారిగా 1995లో అయన కృషికి సేవ అవార్డును అందుకున్నారు. అలాగే 2017లో పద్మశ్రీ అవార్డు ఆయనను వరించింది. అప్పటి రాష్ట్రపతి ప్రణభ్‌ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అకాడమీ ఆఫ్‌ యూనివర్సల్‌ గ్లోబల్‌ పీస్‌ గౌరవ డాక్టరేట్‌ సైతం ఆయన అందుకున్నారు.

ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా చెట్లు నాటడాన్ని ఆయనకు అలవాటు. అనేక బంజరు భూములు ఆయన వల్ల హరిత వర్ణాన్ని సంతరించుకున్నాయంటే అతిశయక్తి కాదు. మనిషి ప్రకృతి ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయో చెప్పడానికి వనజీవి రామయ్య జీవితం ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా, నిస్వార్థ ఆయన సాగించిన సేవా కార్యక్రమాలు ఆయనను చిరస్మరణీయుడిని చేశాయి. చివరకు అయన తన మనుమలు, మనుమరాళ్ళకు చందనపుష్ప, హరిత లావణ్య, కబంధ పుష్ప, వనశ్రీ అని మొక్కల పేర్లు పెట్టి పర్యావరణంపైన, మొక్కల పెంపకం పైన ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని, ప్రేమను చాటుకున్నారు. 60 ఏళ్ల వయసులోనూ ఆయన రోడ్ల వెంట, ఖాళీ ప్రదేశాల వెంట తిరుగుతూ తన భార్య సమేతంగా మొక్కలు నాటే వారు. ఓ విధంగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరిహారం ఆలోచనకు అయన ప్రేరణ అని కూడా చెప్పవచ్చు. అందుకే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అయను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జీవిత చరిత్రను ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా పొందుపరిచింది. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదవ తరగతిలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా బోధిస్తుందంటే అయన ఎంతగా పర్యావరణం పై స్పూర్తి నింపారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని ప్రతిఒక్కరు మొక్కలు పెంచుతూ పర్యావరణ హితానికి పాటుపడితే అదే వనజీవి రామయ్యకు ఇచ్చే గొప్ప నివాళి అవుతుంది.

ప్రముఖుల సంతాపం..
వనజీవి రామయ్య మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్రంలోని ప్రముఖులు అయన కుటుంబానికి సంతాపం తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్‌, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉతమ్‌ కుమార్‌ రెడ్డి, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహా, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, ఎంపీలు డికె. అరుణ, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు తదితరులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ మహానీయుని కోల్పోయిందని వారు అన్నారు. వనజీవి రామయ్య మృతి ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. వనజీవి రామయ్య కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారని గుర్తు చేసుకున్నారు. ఆయన పర్యావరణ పరిరక్షణకు అంకితమై ఆరున్నర దశాబ్దాలుగా ఆయన హరిత యాత్రను కొనసాగించారని ఆయన జీవితం భవిష్యత్‌ తరానికి ఆదర్శమని ఆయనను స్పూర్తిగా తీసుకొని పర్యావరణ పరిరక్షణకు అందరూ ప్రతిన భూనాలని విజ్ఞప్తి చేశారు.

Latest News

నిరుద్యోగి జీవితం..

ఈ జీవితంలో రోజులు గడిచేలా ఖాళీ క్యాలెండర్ పేజీలు మాత్రమే మిగులుతాయి. కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా అలసటతో నీరసపడుతుంది. కానీ… ఈ అంధకారంలోనూ ఒక చిన్న...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS