- ఫతేనగర్‌లో ఉద్భవ్ పాఠశాల ప్రారంభం
- ఐఐఎం పూర్వ విద్యార్థులను అభినందించిన సిఎస్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ పూర్వ విద్యార్థుల సంఘం హైదరాబాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం హైదరాబాద్ ఫతేనగర్ పరిధిలోని శాస్త్రి నగర్‌లో ఉద్భవ్ పాఠశాలను చీఫ్ సెక్రటరీ కే .రామకృష్ణారావు, డిజిపి డాక్టర్ జితేందర్ లు బుధవారం నాడు ప్రారంభించారు. ప్రతిష్టాత్మకమైన మేనేజ్మెంట్ కళాశాలలో ఒకటైన ఐఐఎం హ్మదాబాద్ లో చదువుకున్న పూర్వ విద్యార్థులైన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎస్వి రమణమూర్తి, షణ్ముఖ, హరీష్ కుమార్, సీతారాం, శ్రీ హర్షలు బోర్డు ట్రస్టీలుగా ఈ ఉద్భవ్ పాఠశాల ను ప్రారంభించారు. మురికివాడ ప్రాంతాలకు చెందిన బాల బాలికలకు విద్యను అందించాలని సదుద్దేశంతో ఈ పాఠశాల ద్వారా ఎల్‌కేజీ నుండి పదవ తరగతి వరకు నాణ్యమైన విద్యను భోధించనున్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ…. పేద విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపేందుకు నెలకొల్పిన ఈ పాఠశాల విజయవంతంగా కొనసాగాలని అభిలాషించారు. ప్రజలకు అందించే ఉత్తమ సేవ విద్య అని అభివర్ణించారు. తాను సైతం ఈ రకమైన పాఠశాలలో విద్యను అభ్యసించానని, విద్యార్థులలో ఉన్న సామర్థ్యాన్ని వెలికి తీసి వారికి చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని సూచించారు. పేద విద్యార్థులకు సహాయపడేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.
డిజిపి జితేందర్ మాట్లాడుతూ.. విద్యను అభ్యసించడానికి పేద గొప్ప తేడాను ఉండవని అందరిలోనూ ప్రతిభ ఉంటుందన్నారు. పురాణాలలో చెప్పినట్లు హనుమంతుని బలం తనకు తెలియనట్టుగా… విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ ను ఉపాధ్యాయులు కనుగొని వారిని సరైన మార్గంలో నడిపించినట్లయితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందించవచ్చు అన్నారు. పేద విద్యార్థుల కోసం ఐఐఎంఏ పూర్వ విద్యార్థుల సంఘం నెలకొల్పిన ఉద్భవ పాఠశాల పేద విద్యార్థుల జీవితాలలో వెలుగు నింపుతుందన్నారు.
ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఆర్. రవి కుమార్ మాట్లాడుతూ.. కొత్త ఫతేనగర్ క్యాంపస్ రసూల్‌పురా మరియు ఫతేనగర్ మురికివాడ ప్రాంతాల పిల్లలకు ఆశాకిరణంగా నిలుస్తుందనీ అభిప్రాయ పడ్డారు. నాణ్యమైన విద్యను బోధించడం ద్వారా పేద ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
శివకుమార్ మాట్లాడుతూ.. ఈ క్యాంపస్ ప్రారంభంతో, తెలంగాణ రాష్ట్ర బోర్డు సిలబస్ ప్రకారం ఎల్‌కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు సేవలందించనున్నామన్నారు. విలువలతో కూడిన విద్యను బోధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఫండ్ రైజింగ్ కమిటీ చైర్మన్ టి. మురళీధరన్ ఉద్భవ్ పాఠశాలల విశిష్టతను తెలియజేశారు. ఉన్నత విద్య మరియు అర్థవంతమైన కెరీర్‌లను అందిస్తున్నాయన్నారు.
కాగా, గతంలో నెలకొల్పిన ఉద్భవ పాఠశాలతో కలిపి ప్రస్తుతం 1,086 మంది విద్యార్థులు , 55 మంది ఉపాధ్యాయులు, 3 ప్రధానోపాధ్యాయులు , 11 మంది సహాయక సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ఫతేనగర్ క్యాంపస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కోరమండల్, ఈ వై, సిగ్నోడ్, ఆర్‌బిఎల్ బ్యాంక్, నా కూడా కెమికల్స్ ప్రతినిధులతో పాటు శాంత కుమారి, వీరేశ్వర్, రంగా కోట, తిరుమల రావు లను చీఫ్ సెక్రటరీ, డిజిపిలు సన్మానించారు.