క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్లు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన క్రిప్టో మార్కెట్లోకి 300 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.26 లక్షల కోట్లును చొప్పించింది. ఆయన ఆదివారం రాత్రి ఐదు క్రిప్టో కరెన్సీలను అమెరికా వ్యూహాత్మక రిజర్వులుగా ఉంచాలనుకొంటున్నట్లు సోషల్‌విూడియా వేదికగా ప్రకటించారు. ఈమేరకు ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్ క్రిప్టో వ్యూహాత్మక రిజర్వులు ఏర్పాటుచేసేలా పని చేయాలని మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ రిజర్వుల్లో ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్(సోలాన,), ఏడీఏ (కార్డనో) కరెన్సీలను చేర్చాలన్నారు. ఆ తర్వాత గంటన్నరకు బిట్‌కాయిన్, ఎథర్‌ను కూడా చేర్చాలని పోస్టు పెట్టారు. గతంలో ట్రంప్ క్రిప్టోలపై ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ జారీ చేసిన సమయంలో కాయిన్ల పేర్లను ప్రస్తావించలేదు. తాజాగా అమెరికా అధ్యక్షుడి ప్రకటన వెలువడిన వెంటనే ఐదు క్రిప్టో కరెన్సీల విలువ దూసుకెళ్లింది. ఇక వీటిని అమెరికా ఎలా నిల్వలు చేస్తుందనే అంశంపై మాత్రం వివరాలు వెల్లడి కావాల్సిఉంది. ఎక్స్‌ఆర్‌పీ, ఎస్‌వోఎల్, ఏడీఏ విలువ 62శాతం పెరగ్గా.. బిట్‌కాయిన్, ఎథర్ విలువ 10శాతానికి పైగా ఎగసింది. వాస్తవానికి బిట్‌కాయిన్ ఫిబ్రవరి నెలలో కొంత విలువ కోల్పోయింది. ఇప్పుడు మళ్లీ వేగంగా పుంజుకొంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ట్రంప్ క్రిప్టోలను బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పటికే అధ్యక్షుడిగా ఉన్న బైడెన్ మాత్రం మనీలాండరింగ్, మోసాల భయంతో వీటిని అణచివేసేందుకు యత్నించారు. ఇక ట్రంప్ విజయం తర్వాత బిట్‌కాయిన్ ధర దూసుకెళ్లింది. ఆయన అధ్యక్ష కార్యాలయంలోకి రాగానే.. క్రిప్టోలపై పని చేయడానికి ఓ ప్రెసిడెన్షియల్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటుచేశారు. ఈ సంస్థ అవసరమైన చట్టాలు, నిబంధనలు తయారుచేయనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక గతంలో క్రిప్టో కంపెనీలపై జరుగుతున్న చాలావరకు దర్యాప్తులు నిలిచిపోయాయి.