- సర్వే నెం. 273లో 42ఎకరాలు కొట్టేసిన కేటుగాళ్లు..
- కోట్ల విలువ చేసే పట్టా భూమి మాయం
- అక్రమార్కులకు అధికారుల అండ
- తప్పుడు రికార్డులు సృష్టించిన భూకబ్జా
- ముడుపులు తీసుకొని భూమిని అప్పజెప్పిన రెవెన్యూశాఖ
- సర్వే నెం.273లో 532ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి భూసేకరణ చేసిన అప్పటి ప్రభుత్వం
- మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్‌ప్రముఖ్ పట్టాదారు
- కబ్జా కాలంలో ముగ్గురు పేర్లను అక్రమంగా చేర్చిన అప్పటి ఆఫీసర్లు
- ప్లాట్స్ చేసి అమాయకులకు అమ్మిన కబ్జాదారులు
- కొంత అటవీ భూమిని సైతం మింగేసిన దగాకోరులు
- పట్టా భూమిని స్వాధీనం చేసుకోవాలని బాధితుల డిమాండ్
ప్రభుత్వ, అసైన్డ్, అటవీ, దేవాదాయ శాఖ భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఎక్కడ ఖాళీ కనపడితే చాలు వెంటనే అక్కడ వాలిపోయి అట్టి భూమిని పొతం పెట్టేవరకు నిద్రపోరు. రాష్ట్రంలో భూముల ధరలు బాగా పెరిగిపోవడంతో కబ్జాకోరులు వేటిని వదలడం లేదు. ‘ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి’ అన్నట్టు కబ్జాదారులకు అదేపనిగా పెట్టుకుంటున్నారు. రాజకీయ, డబ్బు బలంతో అలవొకగా భూములను చెరబడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసే ఆయా శాఖల అధికారుల అండదండలతోనే ల్యాండ్ కబ్జాకు పాల్పడుతున్నారు. అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అక్రమార్కులకు సపోర్ట్ చేస్తున్నారు. డబ్బులు ముట్టచెప్పితే చాలు.. భూ రికార్డులను తారుమారు చేయడంలో వారు సిద్ధ హస్తులు. రికార్డులను సైతం మార్చేసి అక్రమ మార్గంలో భూములను ముట్టచెప్పుతారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు సెంట్ ఉన్నా కూడా దాన్ని మింగేస్తున్నారు. హైదరాబాద్ కు అనుకొని ఉండడంతో పొలిటికల్ లీడర్ల అండతో ల్యాండ్స్ కబ్జా చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 273 పట్టా భూమి కబ్జాకు గురైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సర్వే నెంబర్ 273లో విస్తీర్ణం 574ఎకరాల 3గుంటల పట్టా భూమి కలదు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల ప్రకారం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్‌ప్రముఖ్ అనే పట్టాదారు పేరుతో ఉంది. ఈ భూమి వివరాలు పరిశీలిస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ ప్రైవేట్ స్థలాల రికార్డుల నందు నమోదు కావడం జరిగింది. ఈ రికార్డుల ప్రకారం సుమారు 15,964 ఎకరాల 25 గుంటల భూమిని కేంద్ర ప్రభుత్వం పట్టాదారుల నుండి భూమి సేకరించడం జరిగింది. ఈ భూమిలోనే సర్వే నెంబర్ 273లో 532 ఎకరాల పట్టా భూమి కూడా ఉంది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వం గొప్ప ఉద్దేశ్యంతో వాతావరణ సమతుల్యాన్ని కాపాడడం కోసం పట్టాదారుని నుండి సర్వే నెంబర్ 273లో 532ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం భూసేకరణ చేయడం జరిగింది. తదనంతరం అట్టి భూమిని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసింది. భూ సేకరణ అనంతరం మిగులు భూమి 42 ఎకరాలు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్‌ప్రముఖ్ పేరుతో రెవెన్యూ రికార్డులో నమోదు అయ్యినట్లు కలెక్టర్, మండల తహసీల్దార్, సర్వేయర్, వీఆర్‌వోలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో పొందుపర్చడం జరిగింది.
‘ఏదుం తిన్నా ఏకాసే, పందుం తిన్నా పరగడుపే’ అన్నట్టు ఉంటారు అక్రమార్కులు. రాజకీయ, డబ్బు బలంతో చేసే పనులన్నీ చేసి పైకి చూడ ఏమి ఎరగనట్టు ఉంటారు. అధికారుల అండ ఉంటే చాలు తిమ్మిని బమ్మి చేసేస్తున్నారు. 1984లో పట్టదారు కాలంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్‌ప్రముఖ్ ఉండగా కబ్జా కాలంలో సామ యాదగిరి రెడ్డి పేరున 10 ఎకరాల 20 గుంటలు, కె.అంజిరెడ్డి పేరిట 21 ఎకరాలు, జరుక పోచయ్య పేరున 10 ఎకరాల 20గుంటలు అక్రమంగా నమోదై ఉంది. ప్రొసీడింగ్ నెం. ఎ1/1911/1984 ప్రకారం ఈ ముగ్గురు కబ్జా కాలంలో నమోదు కావడం జరిగింది. అప్పట్లో అధికారులను లోబర్చుకొని రికార్డులు నమోదు చేశారు. ‘అందరూ శ్రీ వైష్ణవులే బుట్టెడు రొయ్యలు మాయమయ్యాయి’ అన్న చందంగా తయారైంది అక్రమార్కుల తీరు.
అయితే, అప్పటి తహసీల్దార్ సీహెచ్. విజయ… కలెక్టర్ కి మరియు ఆర్డీవోకి కార్యాలయ రికార్డు రూంలో అట్టి ప్రోసిడింగ్ రికార్డ్ లేవని స్ఫష్టమైన నివేదిక(లెటర్ నెం. సి/10552015, తేది 24-11-2016)ను అందించింది. అంతేకాకుండా తహసీల్దార్ కార్యాలయంలో పైన పేర్కొన ప్రొసిడింగ్ నెంబర్‌తో రికార్డులు లేవని, అక్రమంగా ఈ ముగ్గురు వ్యక్తులు రికార్డులో నమోదయ్యారని, అక్రమంగా సామ యాదగిరి రెడ్డి 10 ఎకరాల 20 గుంటలు ఉండటమే కాకుండా అటవీ భూమిలోని సర్వే నెంబర్ 273లోని 5 ఎకరాల 10 గుంటల భూమిని కబ్జా చేసినట్లు తహసీల్దార్ విజయ స్పష్టమైన నివేదికను కలెక్టర్‌కి సమర్పించడం జరిగింది. ఈ ముగ్గురు అక్రమార్కులు రికార్డుల ప్రకారం అసలు పట్టాదారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ రాజ్‌ప్రముఖ్ అయితే కోర్టులో నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ నిజాం 8వ వారసుడు అంటూ ఓ నకిలీ వ్యక్తిని సృష్టించి, కోర్టును సైతం తప్పుదారి పట్టించి, ఎక్స్‌పార్టీ ఆర్డర్ ని పొందడం జరిగింది. ఈ విషయాన్ని అప్పటి అధికారులు గుర్తించి, వారు అక్రమదారులని నిరార్థించడం జరిగింది. ఈ ముగ్గురు అక్రమార్కులకు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్‌మెంట్ యాక్ట్ 111/1905 ప్రకారం నోటీసులు (బి2/1071/1982) జారీ చేయడం జరిగింది.
కీ.శే. సామ యాదగిరి రెడ్డి కుమారుడు సామ ప్రతాప్ రెడ్డి, కుమారులు సామ రాంరెడ్డి, సామ విజయశేఖర్ రెడ్డి, సామ జైహింద్ రెడ్డి, సామ కృష్ణారెడ్డి, యాదగిరి రెడ్డి మరో కుమారుడు కీ.శే. నర్సింహారెడ్డి కుమారుడు సామ రవీందర్ రెడ్డి, అదే విధంగా కె. అంజిరెడ్డి, జరుక పోచయ్య లు తప్పుడు పత్రాలు సృష్టించి కోట్లు విలువ చేసే భూమిని కొల్లగొట్టి, ప్లాట్లుగా చేసి కొందరు అమాయకపు ప్రజలకు అమ్మారు. రెవెన్యూ ఇతర శాఖల అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకొని ఏదైనా తారుమారు చేసి పట్టా భూమి, అటవీ భూములను కొల్లగొడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ పెద్దలు, సంబంధిత అధికారులు సైతం పట్టించుకోకపోవడం అంతుచిక్కడం లేదు. ఇకనైనా ఈ విషయంపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమగ్రంగా విచారించి అట్టి భూమిని కాపాడాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అక్రమార్కులపై చట్టరిత్యా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా భారీగా ముడుపులు తీసుకొని తప్పుడు రికార్డులు నమోదు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు.
మరో కథనం ద్వారా సర్వె నెంబర్ 273లో జరిగిన అక్రమాలను పూర్తి అధారాలతో మీ ముందుకు తీసుకురానుంది.. ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..