- 42 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు
- ఏఐసీటీఈ, యూనివర్సిటీ నిబంధనల ఉల్లంఘన
- బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లతోనే బోధన
- 20 కాలేజీల్లో రూ.10లక్షలకు పైగా, 12కాలేజీల్లో రూ.10లక్షల లోపు డొనేషన్లు
- అధ్యాపకులు లేకుండా సిలికాన్ తంబ్ తో మేనేజ్
- 2400 మంది విద్యార్థులకు 32 మంది అధ్యాపకులే
- 76 కళాశాలలో కంప్యూటర్ ల్యాబోరేటరీలు కరవు
- 50 వేల మంది చదివితే 5వేల మందికే ఉద్యోగ అవకాశాలు
- విచారణ జరిపించాకే ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలి
- సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ డిమాండ్
- సీఎం రేవంత్, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు
‘చదువుకున్నోడికన్నా పలానోడు మేలు’ అన్న సామెత నిజం చేస్తున్నారు కొందరు. డబ్బుల కోసం పాకులాడుతున్నాయి. పేద, బలహీన వర్గాలకు చెందిన వారి పిల్లలు చదివే చిన్న చిన్న ఇంజనీరిగ్ కాలేజీలు వాళ్ల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నాయి. రాష్ట్రంలో 42 ఇంజనీరింగ్ కళాశాలల దొంగ లెక్కలు చూపుతున్నాయి. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఇష్టారీతిగా కోర్సులు, సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. మౌలిక వసతులు, ఫ్యాకల్టీ అద్భుతంగా ఉన్నట్లుగా పేపర్ల మీద చూపించుకొని యూనివర్సిటీ అధికారులను, ఉన్నత విద్యా మండలిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు తప్పుదోవ పట్టించడం వలన దాని ఫలితంగా ఇంజనీరింగ్ విద్యలో నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది. నిజానికి వేలాది మంది గ్రాడ్యుయేట్లకు వందల్లో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 57వేల మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. కానీ, స్కిల్డ్ ఉద్యోగాలు పొందుతున్న వారు కేవలం 5వేల మంది అంటే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ప్రతి 60మందికి ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్ నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉండాలి. ఈ లెక్కన 2,400 మంది విద్యార్థులకు దాదాపు 120పైగా అధ్యాపకులు ఉండాలి కానీ కేవలం 35 మంది ఫ్యాకల్టీని పెట్టి కళాశాలలను నడుపుతున్నారంటే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
‘ఆశగలమ్మ దోషమెరుగదు… పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు’ అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల వ్యవహారం ఉంది. కళాశాలల యాజమాన్యాలు అర్హత లేని వారితో చదువు చెప్పిస్తున్నారు. పీహెచ్ డీ, ఏం ఫీల్ చేసిన వాళ్లకు అయితే అత్యధిక జీతాలు ఇవ్వవలసి వస్తుందని, తక్కువ జీతాలతో కేవలం బీటెక్, ఎంటెక్ వాళ్లతో బోధన చేస్తుండడం గమనార్హం. జేఎన్టీయూ పరిధిలోని దాదాపు 76 కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబొరేటరీలు లేవంటే ఎంత దారుణంగా ఉన్నాయో మన కళాశాలలు. సిలికాన్ తంబ్ లో మనోళ్లు కంటే తోపు లేరు. మన ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకులు ప్రతిరోజు హాజరవ్వాల్సిన అవసరం లేదు మొదటిరోజు, ఎగ్జామ్స్, ల్యాబ్ ప్రాక్టికల్స్ అప్పుడు అటెండ్ అయితే సరిపోతుంది. మొదటి రోజు ఇచ్చిన తంబ్ ను సిలికాన్ తంబ్ గా మార్చి దాన్ని సంవత్సరం పాటు నడిపిస్తారు.
‘గుర్రం కరుస్తుందని గాడిద వెనకాల దాక్కున్నాడు’ అన్న చందంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల తీరు ఉంది. కాలేజీకు డొనేషన్లు విచ్చలవిడిగా తీసుకుంటున్నారు. దాదాపు టాప్ కళాశాలలు అని చెప్పుకుంటున్న వాటిలో 10 లక్షలకు పైగా డొనేషన్ వసూలు చేస్తున్నారంటే వీరికి విద్యా వ్యవస్థ పైన ఎలాంటి గౌరవం లేదని అర్థమవుతుంది. వీళ్లు విద్య వ్యవస్థను కేవలం బిజినెస్ పరంగా మాత్రమే చూస్తున్నారు, సర్వీస్ పరంగా కాదని స్పష్టమవుతుంది. ఇన్ఫెక్షన్ అప్పుడు రెంటల్ కంప్యూటర్స్ తీసుకురావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జేఎన్టీయూ పరిధిలో ఉన్న కళాశాలలకు అధికారులు ఇన్ఫెక్షన్ కు వెళ్ళినప్పుడు ముందు రోజే సమాచారం ఇవ్వడంతో, సికింద్రాబాద్ లోని ఒక సెంటర్లో కంప్యూటర్లను అద్దెకు తీసుకొచ్చి రాత్రికి రాత్రే ఏర్పాట్లు చేస్తారు.
ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ఇటికాల పురుషోత్తం ఇంజనీరింగ్, ఎంబీఏ కళాశాలల్లో ఏం జరుగుతుందో చూడడానికి వెళ్లారు.. కొమ్మురు ప్రతాప్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లోనే ఎంబీఏ కూడా కలగదు.. ఇన్ఫెక్షన్ నేపథ్యంలో ఎంబీఏ కళాశాలకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్‌ను పరిశీలించగా అది ఇంజనీరింగ్ కళాశాల రిజిస్టర్‌గా గుర్తించారు. ఎంబీఏ కళాశాలకు సంబంధించిన అటెండెన్స్ రిజిస్టర్ లేదని స్పష్టంగా తెలుస్తుంది..
మరుసటి రోజు ఉన్నతవిద్యామండలికి కళాశాల యాజమాన్యం ఇంజనీరింగ్ కళాశాల అటెండెన్స్ రిజిస్టర్‌పై ఎంబీఏ కళాశాల రిజిస్టర్ అని ఏకంగా కౌన్సిల్లోనే సబ్మిషన్ చేశాడు. ఇలాంటి తప్పుడు అటెండెన్స్ లు సృష్టిస్తున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. ఇదీలా ఉండగా రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత విద్య మండలికి పూర్తిస్థాయి అధికారులు వచ్చి తనిఖీలు చేసి రిపోర్టులు వచ్చిన తర్వాత మాత్రమే రీయంబర్స్ మెంట్ రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి సీజేఎస్ అధ్యక్షులు మాసారం ప్రేమ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డొనేషన్లపైన ప్రత్యేకమైన నిఘా పెట్టి, బి కేటగిరి సీట్లను ప్రభుత్వమే కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని కోరారు..