- వర్ధంతి సభ మీడియా కో ఆర్డినేటర్ కౌటికె విఠల్
మాజీ ముఖ్యమంత్రి, వైశ్య జాతి శిఖామణి కొణిజేటి రోశయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాలని సభ మీడియా కో-ఆర్డినేటర్, వైశ్యసంఘం నేత కౌటికె విఠల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైశ్యజాతి రత్నం రోశయ్య సేవలు ఎనలేనివని ఆయన పేర్కొన్నారు. అజాతశత్రువుగా పేరొందిన రోశయ్య ఒక్క వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల వారికి ఆరాధ్య దైవమని విఠల్ చెప్పారు. ఆయన మరణించినా ఆయన సేవలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనివన్నారు. ‘చైతన్య స్ఫూర్తి-మహాశయా రోశయ్య’ పేరిట ఈ నెల 4న హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో నిర్వహించే వర్ధంతి సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత తదితర వైశ్య ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు కూడా హాజరవుతారని తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వైశ్యులందరూ తరలిరావాలని పిలుపునిచ్చారు. వచ్చిన వారందరికీ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజన సౌకర్యం కల్పించామని, దూర ప్రాంతాల నుంచి బస్సులు కూడా ఏర్పాటు చేశామని కౌటికె విఠల్ పేర్కొన్నారు. వైశ్యులంతా తరలివచ్చి వైశ్య మహానేత రోశయ్యకు ఘనంగా నివాళులర్పించాలని ఆయన కోరారు.