- పుప్పాలగూడలో చెరువును చెరబట్టిన దగాకోరు కంపెనీ..
- సర్వే నెంబర్ 272, 273, 274 నిషేధిత జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని, చెరువును కొల్లగొట్టి స్వాహా చేసిన కేటుగాళ్లు
- దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన కబ్జాకోర్లు
- కాసులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన అధికారులు
- స్పెషల్ చీఫ్ సెక్రటరీ హరిహరన్ ఆదేశాలు సైతం బేఖాతరు
- ఫీనిక్స్కు వర్తించని వాల్టా చట్టం 2002 నిబంధనలు
- గండిపేట తహసిల్దార్ అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదు
చేయకపోవడంలో మతలబెంటి..? - వేల కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అవుతుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలి
- అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారించి, కబ్జాలను కట్టడి చేయాలని కోరుతున్న సామాజిక వేత్తలు
నాదారి రహదారి ఎవరూ అడ్డు రావద్దు మీకే ప్రమాదం అంటాడు ఒక సినిమాలో ఒక హీరో..ఈ డైలాగ్ విని ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు..అయితే ఇక్కడ అంతా రివర్స్. మా దారి అడ్డదారి.. దీనికి ఎవరైనా అడ్డు వస్తే కాసులు వెదజల్లి కొనేస్తాం. అవి ప్రభుత్వ భూములైనా.. చెరువులైనా, కుంటలైనా.. మాకు నచ్చితే ఆక్రమిస్తాం.. అడ్డదారిలో అనుమతులు తెచ్చుకుంటాం. అక్రమ నిర్మాణాలు నిర్మిస్తాం..అడ్డగోలుగా అమ్మేస్తాం…కోట్లు వెనకేసుకుంటాం.. అంటున్నారు ఫీనిక్స్ యజమానులు. వీరి బరితెగింపు చూసి అందరూ ముక్కుమీద వేలు వేసుకుంటున్నారు.. హైడ్రా సైతం ఏమీ అర్ధం కాక తలపట్టుకుంటున్నట్టు విశ్లేషకులు అనుకుంటున్నారు.. మరి హైడ్రా రంగనాధ్ ఎందుకు ఉపేక్షిస్తున్నారో..? అర్ధం కావడం లేదు. సరైన సమయంకోసం వేచి చూస్తున్నారా..? అన్నది చూడాలి మరి.
రంగారెడ్డి జిల్లా, గండిపేట మండలంలోని, పుప్పాలగూడ గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 272, 273, 274 లతో రూ.1000 కోట్లకు పైగా విలువ గల ప్రభుత్వ భూమి, చెరువుపై కన్నేశారు ఫినిక్స్ నిర్మాణ సంస్థ యాజమాన్యం.. అడ్డదారి సంపాదనలకు అలవాటు పడిన భూ ఆక్రమణదారులు భూ బకాసురుని అవతారమెత్తి దర్జాగా కబ్జా చేస్తూ నేడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారు.. చెరువును చరబట్టి, దొంగ పత్రాలను సృష్టించి, వాల్టా చట్టం 2002 నిబంధనలను ఉల్లంఘించి, అక్రమార్గంలో ఎన్ ఓసిలతో పాటు నిర్మాణ అనుమతులు పొందడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
వేల కోట్ల విలువైన స్థలం అన్యాక్రాంతం అవుతుంటే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు పట్టింపు లేదా..? అనే వాదనలు వినిపిస్తున్నాయి..చెరువు నడిబొడ్డులో 42 అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటే.. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంలో మతలబు ఏంటి..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. ఇటీవల ఇదే ప్రాంతంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికిష్ కుమార్ సుమారు రూ. 150 కోట్ల చిలుకు అక్రమస్తులను పోగు చేసుకోవడం..ఇదే ప్రాంతంలో వేల కోట్ల విలువైన స్థలాలు కబ్జాకు గురికావడం చూస్తుంటే అధికారులు భారీ అవినీతికి పాల్పడి ఫినిక్స్ నిర్మాణ సంస్థ వెదజల్లిన అమ్యామ్యాలకు అమ్ముడుపోయి, అడ్డగోలుగా పత్రాలు సృష్టించుటకు సహకరించి నిర్మాణ అనుమతులు ఇచ్చారనే విషయం తేటతెల్లమవుతుంది..కళ్ళ ఎదుటే చెరువును పూడ్చి భూ కబ్జాలకు పాల్పడుతుంటే గండిపేట తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం సదరు అధికారి అవినీతికి అద్దం పడుతుందని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ఎస్ హరిహరన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో పుప్పాలగూడలో ఉన్న ప్రభుత్వ భూములను నిషేధిత జాబితాలో పొందపరిచి, వాటిని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులకు జారీ చేసిన ఉత్తర్వులను ఖాతరు చేయకుండా దర్జాగా నిర్మాణ అనుమతులు ఇవ్వడం, దొడ్డి దారిన ధరణిలో నమోదు చేయడం, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి, ఆధారాలను సృష్టించడం ఫినిక్స్ నిర్మాణ సంస్థ యాజమాన్యం చేస్తున్న కబ్దాలకు పరోక్ష సహకారం అందించడంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దృష్టి సారిస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని పలువురు మేధావులు చర్చించు కుంటున్నారు.. రేరా అధికారులు సైతం ప్రభుత్వ భూమి కబ్జాకు లేదా అనుమతులు ఇవ్వడం ఎలా సాధ్యమని పలువులు సామాజికవేత్తలు ప్రశ్నిస్తున్నారు.. ప్రభుత్వ సర్వే నెంబర్లకు జై నెంబర్లను జోడించి, అక్రమంగా రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి కబ్జాలకు పాల్పడుతున్న ఫినిక్స్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు చేపట్టి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైట్ విసిట్ చేసి కబ్జాకు గురి అయిన ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ నిర్మాణాన్ని తక్షణమే కూల్చివేసి అందుకు అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కబ్జాకు గురి అవుతున్న ప్రభుత్వ భూమిని పరిరక్షించి అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూడాలని హైద్రా కమిషనర్ రంగనాథ్ దృష్టి సారించాలని స్థానిక ప్రజలు దిమాండ్ చేస్తున్నారు.. అక్రమంగా పొందిన ఇరిగేషన్ ఎన్ఎస్, మాయమైన హెచ్ఎండీఎ లేక్ ఐడి నెంజర్ 66 వ్యవహారం, దొడ్డి దారిన పొందిన నిర్మాణ అనుమతులు, ఒకే భూమికి ఒకే రోజు వరస రిజిస్ట్రేషన్లతో రిజిస్ట్రేషన్ల శాఖకు సవాలు విసురుతూ చేసిన రిజిస్ట్రేషన్ల వ్యవహారం, ఫీనిక్స్ నిర్మాణ సంస్థ హైదరాబాద్ పరివాహక ప్రాంతాల్లో వివిధ చోట్ల చేస్తున్న అక్రమ నిర్మాణాలు, చేసిన కబ్జాల పై మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ” ఆదాబ్ హైదరాబాద్ “మా అక్షరం అవినీతిపై అస్త్రం”