(సెలవు రోజు పాఠశాలలు నడుపుతున్న నారాయణ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు)
- మాకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్
- సిస్టం.. మా ఇంటి చుట్టం.. ఏమయిన చేస్తాం
- మాకు పైసలున్నయి వేటినైనా మేనేజ్ చేస్తాం..
- కొన్నెండ్లుగా ఇష్టానుసారంగా బరితెగింపు
- మామూళ్ల మత్తులో జిల్లా విద్యాశాఖ అధికారి.
- ఎన్ని ఫిర్యాదులు చేసినా.. పట్టించుకోని పెద్దసారు
- బాలల హక్కుల కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలి
- చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
వీళ్ళు మారరు.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎంతమంది చనిపోయిన వీళ్ళు విద్యార్థులను గోసవుచ్చుకోవడం మాత్రం మారరు..వీళ్ళని ప్రభుత్వాలు కూడా ఏమి చేయవని ధీమా వీళ్లది.. మొన్ననే మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సారు ఓ మీడియా సమావేశంలో ఓ ముచ్చట చెప్పిండ్రు.. విద్యార్థులను వేధిస్తే సహించమని సారు చెప్పి పట్టుమని 15 రోజులు కూడా కాలే.. వీళ్ళ కథ షరా మామూలే.. సారుకు బయపడతారా ఈళ్ళు.. సీఎం సారుకే భయపడరు..ఈ కార్పొరేట్ పెద్దసార్లు.. మంత్రి మాటలకు విలువిస్తరని ఎట్ల అనుకుంటాము చెప్పండి.. నిజానికి వీళ్లకు ప్రభుత్వం అంటే లెక్కలేదు బాస్.. సిస్టం..వీళ్ళ ఇంటి చుట్టమట. ఏమయిన చేస్తారట..ఎంతకైనా తెగిస్తారట..ఈల్ల దగ్గర బొచ్చెడు పైసలున్నాయట.. వీళ్లు తలుచుకోవాలేగాని ప్రభుత్వాలే మారుతాయట.. అందుకే సర్కారోళ్ళు ఈల్ల జోలికి రారట..వీళ్ళు వేటినైనా. ఎవరినైనా మేనేజ్ చేస్తారట.. బాల్యం చిద్రమైతే వీళ్ళకేంటి సారు..వీళ్లకు మాత్రం మన పైసలు మాత్రమే కావాలి.. మన పిల్లలు పిచ్చోళ్ళయితే ఈళ్లకేంటి సారు..తల్లిదండ్రులు మళ్లోసారి జర సోచాయించుండ్రి..మనోల్లను మనం ఏడ ఇడిసిపెట్టినమొ.
సూర్యాపేట జిల్లాలో మాత్రం విద్యాశాఖ అధికారి పెట్టిందే రూల్ :
విద్యా సంస్థలలో రాష్ట్రమంతటా ఒకే రూల్ ఉంటే, సూర్యాపేట జిల్లాలో మాత్రం రూల్ మరోలా ఉంటుందని ఇక్కడి జనాలు చెప్పుకుంటున్నారు.. ఇక్కడి జిల్లా విద్యాశాఖ పెద్దసారు గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు పెన్నుల ఇంకు సరిపోదంటే నమ్ముతారా.. మీరు నమ్మరు సారు కానీ నిజం. సూర్యాపేట జిల్లాలో ఈ విద్యాశాఖ అధికారిదే హావ నడుస్తుందట. సారు పైసలు ఆడ ఈడ తీసుకుంటాడని అనుకుంటళ్లు.. ఇచ్చోటళ్లు అడిగితె మాకు చెబుతరా.. చెబితే బావుండు..జిల్లా అయిన సక్కగయ్యేది. సూర్యాపేట జిల్లాలో ఈ సారు అచ్చినప్పటి నుంచి పలు ప్రైవేటు విద్యాసంస్థలు వారంలో ఏడు రోజులకు ఏడు రోజులు విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారట. సారుకు సదువంటే ఎంత పట్టింపు చూడుండ్రి.. సదువు.. సదువు అని పిల్లలు పిచోళ్లయితే ఆ సారు కేంటి చెప్పుండ్రి.. దీని మూలంగా (చిన్న వయసులో) విద్యార్థులు తీవ్రస్థాయిలో ఒత్తిడికి గురావుతున్నారు. సారుకు మస్తుమంది చెబుతున్నరట.. ఆదివారం సధువులు మనోళ్లకు అచ్చిరావని.. ఆ ఒత్తిడి కాస్త ఆత్మహత్యలకు దారితీస్తున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా జిల్లా విద్యాశాఖ సారూ అండదండలతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య, నారాయణ పాఠశాలలు విద్యా శాఖ నిబంధలకు విరుద్ధంగా సెకండ్ శనివారాలు, ఆదివారాలు కూడా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పేరిట (ఉదయం 09 నుండి సాయంత్రం 05) క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ తతంగమంతా సారు జిల్లాలో ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి జరుగుతుందట. విద్యార్థి సంఘాలు పిర్యాదులు చేసిన పట్టించుకుంటలేడట సారూ. సంబంధిత శాఖ అధికారులు, ప్రైవేటు విద్యాసంస్థలకు అమ్ముడుపోయి సెలవు రోజు క్లాసులు జరుపుకోవడానికి కూడ అనుమతిచ్చారని చెప్పుకుంటున్నారు.. ఇది నిజమో అబద్దమో తెలియదు గాని ఉట్టిగనే ఎవ్వరు గమ్మునుంటరు చెప్పుండ్రు సారూ.. సాగారుతో ఈ వ్యవహారం కాదని తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు ఆదివారం జిల్లా కేంద్రాల్లోని నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలలలో విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పాఠశాలలను సందర్శించి విద్యార్థులను బయటకు పంపించారు.
కార్పోరేట్ దోపిడికి విద్యార్ధులు బలి
తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్పాటు అయిన కార్పోరేట్ నారాయణ, శ్రీ చైతన్య పాఠశాలల దోపిడీ వ్యవహారం విద్యార్ధుల ప్రాణాలను బలి తీసుకుంటుంది. పేద, మధ్య తరగతి విద్యార్ధుల వద్ద లక్షల రూపాయలు దండుకుంటున్న కార్పోరేట్ వ్యవస్థలు ఆర్ధికంగ, మానసికంగ విద్యార్థులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఉజ్వల భవిష్యత్ ఉండాల్సిన నవ యవ్వన బాల మొగ్గలని, ర్యాంకుల పేరిట ఒత్తిడికి గురి చేసి ఆత్మహత్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని నారాయణ, శ్రీ చైతన్య దోపిడి విద్యా సంస్థల నిర్వాహకులు నిబంధలకు విరుద్దంగా సెలవు రోజు కూడా ప్రత్యేక తరగతులు కొనసాగిస్తూ విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు.ఈ విషయంపై బాలల హక్కుల సంఘం కూడా జోక్యం చేసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు..
విద్యార్థుల ద్వార తెలుసుకోని అడ్డుకున్నాం
జిల్లా కేంద్రం లో నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు సెలవు రోజులలో తరగతులు నిర్వహిస్తున్న విషయం విద్యార్థుల ద్వారా తెలుసుకొని అడ్డుకున్నామని తెలంగాణ స్టూడెంట్స్ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు బారి అశోక్ కుమార్ వెల్లడించారు. ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోట్లేదని అన్నారు. వెంటనే శ్రీ చైతన్న, నారాయణ స్కూల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జె ఎస్ ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తగుళ్ళ జనార్ధన్, టి ఎస్ పి జిల్లా అధ్యక్షుడు వర్రె అంజి, విద్యార్థి సంఘాల నాయకులు గణేష్, శ్రీనివాస్, రాఘవా, త్యాగరాజ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.