- స్కాలర్‌షిప్‌లు రాక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు
- రేవంత్‌రెడ్డి అవగాహన లేని పాలనతో కష్టాలు : హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఓ వర్గం సంతోషంగా లేరని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పాలనపై అవగాహన సీఎం రేవంత్‌రెడ్డి అవగాహనరాహిత్యంతో అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా స్కాలర్‌షిప్‌ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా విమర్శించారు. విదేశీ విద్యా పథకం కింద ఎంపికై, విదేశాలకు వెళ్లిన విద్యార్థులు స్కాలర్ షిప్ డబ్బులు రాక ఆవేదన చెందుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గమన్నారు. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తుండడం.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు శాపంగా మారుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయమై డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రాలేదని, స్కాలర్‌షిప్‌ల బకాయిల విడుదలకు మార్చి వరకు సమయం ఉందని మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఆ మాట చెప్పి మూడు నెలలు పూర్తి కావస్తుందని, ఇప్పటివరకు మూడు రూపాయల బకాయిలు కూడా చెల్లించిన దాఖలు లేవని వెల్లడించారు. రేవంత్ సర్కారుకు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేయడంపై ఉన్న ధ్యాస, పేద విద్యార్థుల చదువులకు బకాయిలు చెల్లించడంపై లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అగ్రవర్ణ పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లి, ఉన్నత చదువులు చదవాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన విదేశీ విద్య పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఒక్క విద్యార్థిని కూడా ఈ పథకం కింద ఎంపిక చేయలేదన్నారు. ఏడాదిన్నరగా ప్రక్రియ దరఖాస్తుల దశలోనే నిలిచిపోయిందని చెప్పారు. కొందరు దరఖాస్తుదారులు ఇప్పటికే అప్పులు చేసి విదేశీ విద్యకు వెళ్లగా, మరికొందరు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పథకంలో ఎంపిక అవుతామేమో అనే ఆశతో ఇక్కడే ఉండి ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడి తక్షణమే స్కాలర్షిప్ బకా యిలను విడుదల చేయాలని, విదేశీ విద్య పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి పేదలకు విదేశాల్లో చదివే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.