తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటల నుంచే భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావటానికి జనం జంకుతున్నారు. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో హాఫ్‌డే స్కూల్స్‌పై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మాత్రమే పాఠశాలలు కొనసాగుతాయని పేర్కొంది. ఆ తర్వాత పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం అందిస్తారని చెప్పింది. ప్రాథమిక, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలకు హాఫ్ డే ఉంటుందని.. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక పదో తరగతి వార్షిక పరీక్షలు జరిగే పాఠశాల్లో మాత్రం తరగతులు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను తెలియజేయడంతో పాటు అమలును స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్ట్ ఆదేశించారు.