- విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు
- కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు
- చీర్యాల్‌లో ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు
- అటువైపు కన్నెత్తి చూడని టౌన్ ప్లానింగ్ అధికారులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఎటు చూసినా అనుమతి లేని నిర్మాణాలు దర్శన మిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులకు ఆదాయ వనరులుగా మారడంతో వాటిపై అధికారులు చర్యలకు ఉపక్రమించడం లేదు.
ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ అధికారి అండదండలు :
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని చీర్యాల్ రెవెన్యూ సర్వే నంబర్ 62లో చేపడుతున్న ఫామ్ హౌస్ నిర్మాణానికి మున్సిపల్ కీలక అధికారి అండదండలు పుష్కలంగా ఉండడంతో టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫామ్ హౌస్ మరియు అందులో స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు ప్రస్తుతం చకచకా కొనసాగుతున్నా కూడా తన బంధువు స్నేహితుడికి చెందిన ఫామ్ హౌస్ కావడంతో పాత నిర్మాణమే అంటూ ఫిర్యాదుదారులనే ఆ అధికారి తప్పు దోవ పట్టించడం గమనార్హం. రోడ్డు ప్రమాదాల దృష్ట్యా ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు నుండి డైరెక్ట్ అప్రోచ్ రోడ్డుకి నిబంధనలు ఉన్నా కూడా ఫామ్ హౌస్ నిర్మాణదారులు అవేవీ పట్టించుకోకపోవడం గమనార్హం. ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నా కూడా తమ కంటికి కనబడడం లేదన్నట్లుగా మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తున్నారు.
అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఫామ్ హౌస్‌లు :
దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఫామ్ హౌస్‌లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాలలో ప్రకటనలు ఇస్తూ యువతని ఆకట్టుకుంటున్నాయి. యువతను చెడుదోవ పట్టేలా చేయడానికి ఈ ఫామ్ హౌస్‌లు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఇటీవల యాద్గార్‌పల్లిలోని సిద్ధార్థ ఫామ్ హౌస్‌లో మద్యం సేవించిన యువకుడు స్విమ్మింగ్ పూల్‌లో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఫామ్ హౌస్‌లలో నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్‌లు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి, ఫామ్ హౌస్‌ల నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు :
దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏడవ వార్డు పరిధిలోని ప్రగతి నగర్ కాలనీలో ఇటీవలే కూల్చిన షెడ్ కొద్ది రోజుల్లోనే తిరిగి నిర్మాణం జరుపుకుంది. ఇందుకోసం అధికారులకు భారీగా ముడుపులు ముట్టినట్లు సమాచారం. ఇప్పటికైనా దమ్మాయిగూడలో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్, సీడీఎంఎ అధికారులు దృష్టి సారించాలని మున్సిపల్ వాసులు కోరుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడతాం : టీపీవో
మున్సిపాలిటీలోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడతామంటూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీదేవి తెలిపారు.