- క్షమాపణలు చెప్పాలని తేజస్వీ డిమాండ్
బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్ కుమార్ తీరుపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. జాతీయ గీతాన్ని ఆయన అగౌరపర్చడంపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘బీహార్ సీఎం నితీశ్ కుమార్ నిన్న జాతీయ గీతాన్ని అగౌరవపరిచారు. ‘బీహారీ’గా నేను సిగ్గుపడుతున్నా. ఈ సంఘటన చాలా దురదృష్టకరం. సీఎం నితీశ్ కుమార్ పదవీ విరమణ చేయాలి’ అని మీడియాతో అన్నారు. కాగా, బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ నాయకురాలు రబ్రీ దేవి కూడా ఈ సంఘటనపై స్పందించారు. ‘ఆయన (బీహార్ సీఎం నితీశ్ కుమార్) మానసిక స్థితి సరిగా లేదు. ఆయన మనసు పని చేయకపోతే తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అని అన్నారు. మరోవైపు సీఎం నితీశ్ కుమార్ ఆరోగ్య, మానసిక పరిస్థితిపై ఆర్జేడీ ఎంపీ మిశా భారతి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోజూ మహిళలను, పిల్లలను ఆయన అవమానిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎవరి చేతుల్లో ఉన్నదో అన్నది ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆలోచించాలని సూచించారు.