- గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
- ఘనంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం
- విద్యార్థులకు పట్టాలు అందజేత
‘విద్య’తో ప్రపంచాన్ని జయించవచ్చని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. అశోక గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో భాగమైన అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవం శనివారం చౌటుప్పల్లో ఘనంగా జరిగింది. ఈ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పీజీడీఎం విద్యార్థులకు పట్టాలు అందజేశారు. పీజీడీఎం విభాగంలో ఏ హైంధవి (2022), ఎస్ శివాని (2023), పీ హైమవతి (2024), రితికా నితిన్ కులకర్ణి (2024) పీజీడిఎం (ఏఐ & డీఎస్) విభాగంలో బంగారు పతకాలతో గవర్నర్ సత్కరించారు. సర్టిఫికెట్ల అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈ స్నాతకోత్సవం అనేది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదని, అది కలల, క్రమశిక్షణ, సంకల్ప బలం తాలూకా విజయోత్సవం అన్నారు. విద్యార్థులుగా మీ కృషి, గురువుల మద్దతు, కుటుంబ సభ్యుల ప్రేమ మీద నిర్మితమైన ఒక మైలురాయిని దాటుతున్నారని తెలిపారు. లీడర్ అంటే లెర్నింగ్, ఎథిక్, అడప్టాబిలిటీ, డిటర్మనేషన్, ఎంపథి, రెస్పాన్సబిలిటీ అన్నారు. సుందర్ పిచై, ఇంద్రా నూయి, నారాయణ మూర్తి తదితరులను నాయకులకు ఉదాహరణ అని చెప్పారు. విద్యార్థులకు విద్యే ఆయుధం అన్నారు. ఇంజనీరింగ్ విద్యలో నేర్చుకున్న నైపుణ్యాలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రపంచం రోజు రోజుకు అప్డేట్ అవుతుందన్నారు. విద్యార్థులు అందుకు అనుగుణంగా అప్డేట్ కావాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్భంగా అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ చైర్మన్ అశోక్ నొముల మాట్లాడుతూ ముందుగా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మన విద్యార్థులు ఉన్నత స్థానాల్లోకి వెళ్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. బిజినెస్ స్కూల్ పురోగతిని వివరించారు. ఇరాన్ కాన్సుల్ జనరల్ మహ్దీ షరోఖీ మాట్లాడుతూ భారత – ఇరాన్ విద్యా, వ్యాపార సంబంధాలపై మాట్లాడారు. అంతర్జాతీయ అవకాశాలు అన్వేషించాలని విద్యార్థులకు సూచించారు. డెలాయిట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగ జీవితంలో మార్గదర్శక నిబంధనలు, ఉత్తమ ప్రవర్తన, కమ్యూనికేషన్ ప్రాముఖ్యతను వివరించారు. అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ డైరెక్టర్ డాక్టర్ వై లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పీజీడీఎం కోర్సు విజయాలు, ఇంటర్నేషనల్ ఇమ్మర్షన్ ప్రోగ్రాం, అనేక పరిశోధనలు, ప్లేస్మెంట్స్ వివరించారు. ప్రముఖ కంపెనీలు టెక్ మహీంద్రా, ఐబీఎం, హెచ్డీఎఫ్సీ, ఈవై, జెన్పాక్ట్ మొదలైనవి ప్లేస్‌మెంట్ ఇచ్చాయని తెలిపారు. గరిష్ఠ ప్యాకేజ్ రూ.14.5 లక్షలు, సగటు రూ.6.5 లక్షలుగా ఉందన్నారు. 97 మంది విద్యార్థులకు డిప్లొమా ప్రదానం చేయబడిందన్నారు. అందులో 45 మంది విద్యార్థినులు ఉన్నారని తెలిపారు. అనంత పేరుతో కొత్త గ్రంధాలయ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 8.3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన క్యాంపస్ ప్రణాళికను ఆవిష్కరించారు.