హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం హనుమాన్ విజయ యాత్రలు వైభవంగా నిర్వహించినట్లు విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ యువ విభాగమైన బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6000 స్థలాలలో వీర హనుమాన్ విజయ శోభాయాత్రలు వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ బాలస్వామి ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వహిందూ పరిషత్ నేత, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు సభ్యులు రామ్ విలాస్ దాస్ వేదాంత్ భాగ్యనగరంలోని యాత్రకు ముఖ్య వత్తగా హాజరై సందేశం ఇచ్చారు. నిజాంబాద్ లో జరిగిన ర్యాలీలో విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (భాగ్యనగర్ క్షేత్ర) సంఘటన మంత్రి గుమ్మల సత్యంజి సందేశం ఇచ్చారు. కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి దగ్గర కమలానంద భారతి స్వామి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరం తర్వాత నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ర్యాలీలో అత్యధికంగా హిందూ యువకులు పాల్గొనడం విశేషం.
భాగ్యనగరం లోని గౌలిగూడ హనుమాన్ మందిర్ దగ్గర 2004 సంవత్సరంలో ప్రారంభమైన ఈ యాత్ర.. నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం భారీగా నిర్వహిస్తున్నట్లు బాలస్వామి వివరించారు. కులాలకు, రాజకీయాలకు అతీతంగా లక్షలాదిగా హిందూ యువకులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొనడం.. హిందూ ఐక్యతను ప్రదర్శించడం ర్యాలీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఎవరికి వారే స్వచ్ఛందంగా ర్యాలీలో పాల్గొంటూ.. హిందూ ఐక్యతను చాటేందుకు ఈ శోభాయాత్ర ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. హిందూ సమాజమంతా కలిసి మెలిసి ఉండాలని , కులాలను ఆర్థిక సంబంధాలను దూరం పెట్టాలని వక్తలు సందేశం ఇస్తారు.
” ఏక్ హై తో సేఫ్ హై” ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని..” బటేగాతో కటేగా” విడిపోతే పడిపోతాము.. అనేటటువంటి నినాదాలతో మార్మోగించారని, ఈసారి యువకులు భారీ ఎత్తున ఐక్యతను ప్రదర్శించినట్లు తెలియజేశారు.హిందూ యువకులంతా క్రమశిక్షణకు మారుపేగా ఉంటూ.. ఆంజనేయస్వామి ఆదర్శాలను పుణికిపుచ్చుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో రాష్ట్రంలోని పేరుగాంచిన ప్రముఖులందరూ ఒక్కో స్థలానికి వెళ్లి సందేశం అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముక్ బాలస్వామి పాల్గొని హిందూ యువకులకు ఐక్యత సందేశం వినిపించారు. హిందువుల జనాభా తగ్గుతోందని.. అది దేశానికి ప్రమాదకరమని చెప్పారు. గతంలో హిందూ జనాభా తగ్గడం వల్లే దేశం విడిపోయిందని, ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో, హిందువులు అత్యంత దయనీయంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుస్థితి నుంచి భారతదేశాన్ని కాపాడాలంటే హిందూ జనాభా పెంచాలని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో రాత్రి 11 దాకా శోభాయాత్ర జరిగిందని, అక్కడ చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం అభినందనీయమని బాలస్వామి చెప్పారు.