- ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ సాధ్యమైంది
- గత ప్రభుత్వం పథకాలను నేటి ప్రభుత్వం కొనసాగించాలి
- అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళ్ళు అర్పించిన కేసీఆర్
అంటరానితనం, సామాజిక వివక్షకు గురవుతున్న వర్గాలకు సమానవాటా కోసం, సామాజిక న్యాయం కోసం, తన జీవితకాలం పోరాడిన దార్శనికుడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి వారందించిన కృషిని స్మరించుకున్నారు. భారత దేశ స్వపరిపాలన ఆదర్శంగా నిలవాలనే లక్ష్యంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ దేశ రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారని కేసీఆర్ పేర్కొన్నారు. ముందుచూపుతో బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. అంబేద్కర్ ఆశయాలను తెలంగాణ తొలి ప్రభుత్వం, దళిత బంధు సహా పలు పథకాల రూపంలో అమలు చేసిందని, పదేండ్ల కాలంలోనే సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. పాలనలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు, తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి, డా.బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. భారత జాతి గౌరవాన్ని ఆకాశమంత ఎత్తున నిలిపిన ఆ మహనీయునికి ఘన నివాళి అర్పించేందుకు, ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా 125 అడుగుల అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహ రూపాన్ని రాష్ట్రంలో నిలుపుకున్నామన్నారు. డా. అంబేద్కర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన పథకాలను నేటి ప్రభుత్వం చిత్తశుద్ధి తో కొనసాగించాలని, అప్పుడే మనం వారికి ఘన నివాళి అర్పించిన వారమౌతామని కేసీఆర్ స్పష్టం చేశారు.