- ధాన్యం సకాలంలో మద్దతు ధరలకు కొనాల్సిందే
- ధాన్యం కొన్న 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు
- పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
రైతుకు కష్టం.. నష్టం కలిగితే సహించేది లేదని.. నిబంధనలు ఉల్లంఘించే మిల్లులను డీ ట్యాగ్ చేస్తామని.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఇతర జిల్లాల మిల్లర్ల ద్వారా సేకరిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. వివిధ మార్కెట్‌యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ధాన్యపు రాశుల్ని పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖరీఫ్‌లో కనీవిని రీతిలో దాదాపు 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రూ. 8,300 కోట్లతో ఆరు లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగిందని.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రణాళికాయుతంగా వ్యవహరించి ధాన్యం సేకరణ చేసినట్లు తెలిపారు.
24 గంటల్లోపే ధాన్యం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమయిందన్నారు. చిన్నచిన్న లోటుపాట్లు ఉన్నా సరిదిద్దుకొని ముందడుగు వేయడం జరిగిందని, గౌరవ ముఖ్యమంత్రి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మార్చి 31న ఖరీఫ్ ధాన్యం కొనుగోలు పూర్తయిన వెంటనే రబీ సీజన్‌కు సంబంధించి మొట్టమొదట నెల్లూరు జిల్లాపై దృష్టిసారించినట్లు తెలిపారు. గత రెండేళ్ల కాలంలో ఆ జిల్లా నుంచి ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదన్నారు. అక్కడి రైతులు, స్థానిక ప్రజాప్రతినిధుల కోరిక మేరకు తొలిసారిగా 1,30,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగిందని.. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చినందున ఇంకా కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర మేరకు మిల్లర్లు ధాన్యం సేకరించడం లేదని, అదేవిధంగా తరుగు పేరిట అధిక కోతలు విధిస్తున్నట్లు కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పరిస్థితిని స్వయంగా తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే మిల్లర్లపై చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తామని, ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం రైస్ మిల్లర్లకు అండగా నిలిచిందని, గత ప్రభుత్వం వదిలివెళ్లిన రూ. 400 కోట్ల బకాయిలను కూడా చెల్లించడం జరిగిందన్నారు. రైతులు ఇబ్బందిపడేలా మిల్లర్లు వ్యవహరించొద్దన్నారు.
ఎన్‌టీఆర్, కృష్ణా జిల్లాల్లో లక్ష మెట్రిక్ టన్నులు అయినా రెండులక్షల మెట్రిక్ టన్నులు అయినా సేకరిస్తామని, రైతులు ఆందోళనతో తక్కువ ధరకు అమ్ముకోవద్దని సూచించారు. ఆర్‌ఎస్‌కే ద్వారా తమ ధాన్యాన్ని మద్దతు ధరకే అమ్ముకోవచ్చని.. ట్రక్ షీట్ ఆధారంగా 24 గంటల్లోపే ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతుందని మంత్రివర్యులు భరోసా కల్పించారు.ఎన్‌టీఆర్ జిల్లాకు సంబంధించి బుడమేరు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు సంబంధించి దాళ్వా పంట ఆలస్య మైనందున ఈ పంటలో నమోదైన ఖరీఫ్‌ని రబీలోకి వచ్చేలా వెసులుబాటు కల్పించాలని శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ విజ్ఞప్తి చేశారని.. ఈ మేరకు వెంటనే అధికారులను అప్రమత్తం చేసి ఆ మేరకు వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.
రబీ కొనుగోళ్లు ప్రారంభమైనా అకాల వర్షాల వల్ల రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో తడిస్తే ధాన్యం పాడవుతుందనే ఉద్దేశంతో త్వరత్వరగా మిల్లులకు పంపించాలనుకోవడం.. దాన్ని ఆసరాగా చేసుకొని కొందరు మిల్లర్లు రైతులను ఇబ్బందిపెడుతున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, బుడమేరు వల్ల నష్టం వాటిల్లినా ఈసారి చాలా ఎక్కువ దిగుబడి వచ్చిందని, ప్రకృతి సహకరించిందని పేర్కొన్నారు. ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయడం జరుగుతుందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని శాసనసభ్యులు స్పష్టం చేశారు.