- దానిని తిరస్కరించే అధికారం లేదు
- ఓ కేసులో సుప్రీం కోర్టు స్పష్టీకరణ
సైన్‌బోర్డులకు ఉర్దూ భాషను వాడడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మహారాష్ట్రలోని ఓ మున్సిపల్ కౌన్సిల్‌కు ఉర్దూ భాషలో రాసిన సైన్ బోర్డు ఉండడాన్ని కోర్టు అంగీకరించింది. జస్టిస్ సుధాన్షు దూలియా, కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. ఉర్దూ, మరాఠీ భాషకు రాజ్యాంగం ప్రకారం ఒకే రకమైన హోదా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. కేవలం మరాఠీ మాత్రమే వాడాలన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. వర్షతై సంజయ్ బగడే అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. పాటూరు పట్టణంలో ఆయన మాజీ కౌన్సిలర్. పాటూరు మున్సిపల్ కౌన్సిల్ నేమ్‌బోర్డును ఉర్దూలో రాయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. ఉర్దూ భాష పుట్టింది ఇండియాలోనే అని, కానీ ఆ భాష ముస్లింలకు సొంతమైందని కోర్టు పేర్కొన్నది. హిందువులకు హిందీ భాషను, ముస్లింలకు ఉర్దూ భాషను బ్రిటీష్ పాలకులు అంటగట్టారని కోర్టు తెలిపింది.
అయితే ఉర్దూ భాష గురించి చర్చించే సందర్భం ఇది కాదు అని, కానీ హిందీ, ఉర్దూ భాషలు మిక్స్ అయ్యాయని, హిందీ భాష ఎక్కువ శాతం సంస్కృత భాషగా.. ఉర్దూ భాష పర్షియన్ భాషగా గుర్తింపు తెచ్చుకున్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ బ్రిటీష్ పాలకులు మతం ఆధారంగా రెండు భాషలను విభజించినట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. ఇప్పుడు హిందీ భాషను హిందువుల భాషగా, ఉర్దూ భాషను ముస్లింల భాషగా అర్థం చేసుకుంటున్నారని కోర్టు తెలిపింది. చాలా దయనీయమైన పరిస్థితి ఎదురైందని, వాస్తవానికి ఐకమత్యం నుంచి విభజన ఏర్పడిందని కోర్టు పేర్కొన్నది. ఉర్దూ భాషకు ఇండియాలో ఆనవాళ్లు ఉన్నాయని, ఒక మతానికి ఆ భాషను ఆపాదించలేమని కోర్టు తెలిపింది. ఉర్దూ భాషను ఓ ఏలియన్‌గా భారతీయులు చూస్తున్నారని, కానీ ఇది నిజం కాదు అని, మరాఠీ.. హిందీ భాషల తరహాలోనే ఉర్దూ భాష కూడా ఇండో – ఆర్యన్ లాంగ్వేజే అని కోర్టు తెలిపింది. ఉర్దూ భాష ఈ నేలపైనే పుట్టినట్లు కోర్టు చెప్పింది. ఆ భాష ఇక్కడే అభివృద్ధి చెంది, వర్ధిల్లినట్లు కోర్టు పేర్కొన్నది.
శతాబ్ధాల నుంచి ఆ భాష మరింత పదునెక్కిందని, ఎంతో మంది కవులకు చాలా ఇష్టమైన భాషగా మారినట్లు కోర్టు వెల్లడిరచింది. మహారాష్ట్ర లోకల్ అథారిటీ లాంగ్వేజ్ యాక్టు 2022 ప్రకారం ఉర్దూ భాషను వాడరాదు అని పిటీ-షనర్ కోర్టులో వాదించారు. కానీ ఆ చట్టం ప్రకారం ఉర్దూను నిషేధిత భాషగా చూడలేమని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం మరాఠీ, ఉర్దూ భాషలు ఒక్కటే అని కోర్టు పేర్కొన్నది.