- మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ లో కబ్జాల పర్వం
- సర్వే నెం.24/ఆ లో 38గుంటల సీలింగ్ భూమి
- శ్రీ సాయి బాలాజీ ద్వారకామయి రెసిడెన్సీ పేరుతో నాలుగు బ్లాకులు
800 గజాలకు అర్భన్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్‌వోసీ తీసుకొని ఎకరంలో బహుళ అంతస్థులు - ప్రభుత్వ భూమిలో అనుమతులిచ్చిన జీహెచ్ఎంసీ అధికారులు
- అక్రమ భవనాలు కడుతున్న పట్టించుకోని వైనం
- భూమిని స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్
హైదరాబాద్ నగరంలో భూముల వ్యాల్యూ బాగా పెరిగిపోవడంతో కబ్జాల పర్వం సాగుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు అని తేడా లేకుండా కొందరూ ఖతం చేస్తున్నారు. అక్రమార్కులు చేస్తున్న పనిని అధికారులే దగ్గరుండి జై కొడుతున్నారు. అక్రమార్కులు ప్రభుత్వ, అసైన్డ్ భూములు, సీలింగ్ ల్యాండ్స్ కొల్లగొడుతున్నారు. రాజధాని నగరంలో భూములు చాలా కాస్లీ కావడం.. సిటీ పరివాహక ప్రాంతంలో ఎక్కువగా భూమి కబ్జా చేస్తున్నారు. అధికార, డబ్బు బలంతో వాటిని చెరబడుతున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్ మండలం నాగోల్ గ్రామ సర్వే నెంబర్ 24/ఆ లో 38గుంటల సీలింగ్ ల్యాండ్ ఉంది. అయితే, సబ్ డివిజన్ నెంబర్ 24/ఆ ను ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగింది. ఈ సీలింగ్ ల్యాండ్‌లో భారీ ఎత్తున బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తున్నారు. ఆ భూమిని కొందరు నాయకులు, అధికారుల సహాయ సహకారాలతో కబ్జా చేసి యధేచ్ఛగా బహుళ అంతస్తులు నిర్మించారు. సుమారు ఒక ఎకరంలో నాలుగు బ్లాక్ లు కట్టిండు. కానీ, సీలింగ్ ల్యాండ్ లో 800 గజాలకు మాత్రమే అర్భన్ ల్యాండ్ సీలింగ్ నుండి ఎన్ఓసీ తీసుకుని నాలుగు బ్లాక్ లుగా అంతస్థులు నిర్మాణం చేశారు.
సీలింగ్ భూముల్లో ప్రభుత్వం నుండి 800 గజాలకు మాత్రమే అనుమతులు తీసుకొని సుమారు 38 గుంటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా, సీలింగ్ తొలగించకుండా, ఏ విధంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. వాటికి గతంలో ఉన్న అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గవర్నమెంట్ ల్యాండ్ (సిలింగ్ భూమి) కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేపడుతుంటే జీహెచ్ఎంసీ అధికారులు మీన మేషాలు లెక్కించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్భన్ ల్యాండ్ సీలింగ్ 800 గజాలకు డిమార్కేషన్ చేస్తూ ఎన్ఓసీ జారీ చేయడం జరిగింది. ఒకవేళ జీహెచ్ఎంసీ అధికారులు అనుతులు ఇచ్చినట్లయితే ఆ 800 గజాలకు మాత్రమే ఇవ్వాలి.. కానీ, సీలింగ్ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే మిగతా భూమిలో నిర్మాణలకు ఎలా అనుమతులు ఇచ్చారు.
ఉప్పల్ మండలంలో కబ్జా, అన్యాక్రాంతానికి గురైన సర్కారు భూములను ప్రస్తుత తహసీల్దార్ కొరడా ఝళిపించి, అట్టి భూములను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు కబ్జాదారులకు సపోర్ట్ చేస్తునట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఇకనైనా ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సీలింగ్ భూమిలో అమాయకపు ప్రజలను మోసం చేసి, అక్రమంగా శ్రీ సాయి బాలాజీ ద్వారకామాయి రెసిడెన్సీ పేరుతో నిర్మించిన నిర్మాణాలపై ఉప్పల్ ఎమ్మార్వో విచారణ చేసి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో విధులు నిర్వర్తించిన అధికారుల నిర్లక్ష్యంతో సర్కారు భూమి అన్యాక్రాంతం అయినందున వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే వాళ్ల అవినీతి ఆస్తులపై దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అర్బన్ సీలింగ్ ల్యాండ్‌లో నిర్మాణానికి శ్రీ సాయి బాలాజీ ద్వారకామాయి రెసిడెన్సీ వారికి బ్యాంక్ అధికారులు లోన్ ఎలా మంజూరు చేసింది.. ఈ అక్రమంలో ఎవరెవరు భాగస్వాములు అయ్యారో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..